పుష్పక్‌ బస్సుల్లో  డిజిటల్‌ సేవలు.. అలా చేస్తే చార్జీలపై 10 శాతం రాయితీ 

Telangana: Digital Services have Become Available in Pushpak Buses - Sakshi

60 శాతం ఆక్యుపెన్సీతో పరుగులు 

డిజిటల్‌ చెల్లింపులతో ప్రయాణ సదుపాయం 

బస్సు జాడ కోసం ట్రాకింగ్‌ వ్యవస్థ 

రాను పోను చార్జీలపై 10 శాతం రాయితీ 

ప్రయాణికులకు చేరువగా గ్రేటర్‌ ఆర్టీసీ 

సాక్షి, హైదరాబాద్‌: పుష్పక్‌ బస్సుల్లో  డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, తదితర మొబైల్‌ యాప్‌ల ద్వారా టికెట్‌ చార్జీలను చెల్లించవచ్చు. ఇందుకోసం కొత్తగా ఇంటెలిజెన్స్‌ టికెట్‌  ఇష్యూ మిషన్‌లను ప్రవేశపెట్టారు. నగదు, డిజిటల్‌  రూపంలోనూ చార్జీలు చెల్లించే విధంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు  ‘టీఎస్‌ఆర్టీసీ ట్రాక్‌’  ద్వారా  ప్రయాణికులు తాము బయలుదేరే మార్గంలో  పుష్పక్‌ బస్సుల జాడను కనిపెట్టవచ్చు. ఈ  అధునాతన సాంకేతిక  వ్యవస్థను  కొద్ది రోజుల  క్రితమే ఆర్టీసీ  ప్రవేశపెట్టింది.

ప్రయాణికులు  బయలుదేరే సమయానికి అనుగుణంగా అందుబాటులో ఉండే పుష్పక్‌ బస్సుల వివరాలు మొబైల్‌ ఫోన్‌లో లభిస్తాయి. దీంతో బస్సు కోసం ప్రత్యేకంగా ఎదురు చూడాల్సిన  అవసరం లేకుండా సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే  జాతీయ, అంతర్జాతీయ  విమాన సర్వీసుల వేళలకు అనుగుణంగా పుష్పక్‌ బస్సులను  24 గంటల పాటు నడుపుతున్న సంగతి తెలిసిందే. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తున్న  40 పుష్పక్‌ బస్సులకు కొంతకాలంగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది.  
 
ఈజీగా బస్సు..  
►జేబీఎస్, సికింద్రాబాద్‌  నుంచి తార్నాక, ఉప్పల్‌ల మీదుగా ఎయిర్‌పోర్టుకు కొన్ని బస్సులు నడుస్తుండగా, బేగంపేట్‌ పర్యాటక భవన్‌ నుంచి మెహిదీపట్నం, ఆరాంఘర్‌ల మీదుగా మరికొన్ని బస్సులు నడుస్తున్నాయి. అలాగే కేపీహెచ్‌బీ జేఎన్‌టీయూ నుంచి 
గచ్చిబౌలి మీదుగా  ఔటర్‌ మార్గంలో ఇంకొన్ని బస్సులు ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉన్నాయి.  
►ప్రయాణికుల నిరాదరణ కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్న  ఈ బస్సులు కొద్ది రోజులుగా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో  45 నుంచి  60 శాతానికి పెరిగింది. ప్రస్తుతం సుమారు 4500 మందికి పైగా ప్రయాణికులు  ప్రతి రోజు ఈ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. 
►ప్రయాణికులను పుష్పక్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు  ప్రవేశపెట్టిన డిజిటల్‌ చెల్లింపులు, వెహికిల్‌ ట్రాకింగ్‌ వల్ల  గత నెల  రోజుల వ్యవధిలో  సుమారు 500 మందికి పైగా  ప్రయాణికులు  అదనంగా  వచ్చి చేరినట్లు  ఆర్టీసీ  అధికారులు  తెలిపారు.  
 
తిరుమల దర్శనం... 
►మరోవైపు పుష్పక్‌ బస్సుల్లో  తాజాగా లక్కీ డిప్‌లను ఏర్పాటు చేశారు. వారానికి ఒకసారి  ఈ లక్కీడిప్‌ ద్వారా ముగ్గురు ప్రయాణికులను ఎంపిక చేసి వారికి తిరుమలలో ఉచిత దర్శనం కల్పిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో  తిరుపతికి వెళ్లేవారు ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకోసం పుష్పక్‌లో ప్రయాణం అనంతరం టికెట్‌ వెనుక పేరు, ఫోన్‌ నంబర్‌ రాసి లక్కీడిప్‌ బాక్సుల్లో వేస్తే సరిపోతుంది. 

టికెట్‌లపై రాయితీలు.. 
►హైదరాబాద్‌ నుంచి  దేశంలోని వివిధ నగరాలకు బయలుదేరే  ప్రయాణికులు  ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు, తిరిగి ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి  ఒకేసారి టికెట్‌లను కొనుగోలు చేయవచ్చు. ఇలా తీసుకొనే టికెట్‌లపై 10  శాతం వరకు తగ్గింపు ఉంటుంది. కనీసం ముగ్గురు కలిసి  ప్రయాణం చేస్తే 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ  సికింద్రాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు.  
►ఎయిర్‌పోర్టు నుంచి  నగరానికి వచ్చే వారు పుష్పక్‌ బస్సుల్లో  ప్రయాణం చేస్తే మరో  3 గంటల పాటు వాళ్లు అదే టిక్కెట్‌ పై సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఉదాహరణకు ఎయిర్‌పోర్టు నుంచి జేబీఎస్‌కు వచ్చినవారు అక్కడి నుంచి ఎక్కడికైనా సిటీ బస్సుల్లో వెళ్లవచ్చు.  

పర్యావరణ పరిరక్షణను ఆదరించండి 
పుష్పక్‌ బస్సులు వంద శాతం పర్యావరణహితమైనవి. విద్యుత్‌తో నడిచే ఈ బస్సులను  ప్రయాణికులు  ఆదరించడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతుంది.  
– వెంకన్న, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్, సికింద్రాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top