కాంగ్రెస్‌ సంస్థాగత ప్రక్రియ షురూ  | Telangana Congress Party Election Process On June 10th | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సంస్థాగత ప్రక్రియ షురూ 

Jun 6 2022 1:50 AM | Updated on Jun 6 2022 4:00 PM

Telangana Congress Party Election Process On June 10th - Sakshi

కేరళ ఎంపీ రాజ్‌మోహన్‌ను  సత్కరిస్తున్న భట్టి విక్రమార్క 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థా గత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మండల స్థాయి నుంచి ఏఐసీసీ వరకు అన్ని స్థాయిల్లో ఎన్నికలు ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో షెడ్యూల్‌ మేరకు రాష్ట్రంలోనూ సంస్థాగత ఎన్నికల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో భాగంగా ఈనెల 15లోగా బ్లాక్, మండల కాం గ్రెస్‌ అధ్యక్షులను ఎన్నుకోనున్నారు.

ఏఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం బ్లాక్, మండల కమిటీల ఎన్నికలు ఈనెల 10 నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో రైతు రచ్చబండ కార్యక్రమం జరుగుతుండటం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో 15వ తేదీ వరకు అవకాశమిచ్చారు. బ్లాక్, మండల కమిటీలను ఎన్నుకున్న అనంతరం జూలై 7లోగా జిల్లా కమిటీ లు, జిల్లా పార్టీల అధ్యక్షులను ఎన్నుకునే ప్ర క్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత జూలై చి వరి నాటికి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. 

రాష్ట్రానికి రిటర్నింగ్‌ అధికారులు 
ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ఏఐసీసీ నియమించిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నియమితులైన కేరళ రాష్ట్రానికి చెందిన ఎంపీ రాజ్‌మోహన్‌ ఉన్నితన్‌ ఆదివారం గాంధీభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో సహాయ రిటర్నింగ్‌ అధికారి రాజా బగేల్,

తెలంగాణ డిజిటల్‌ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి హర్కర వేణుగోపాల్‌తో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల నుంచి జిల్లా రిటర్నింగ్‌ అధికారులు (డీఆర్‌వో), బ్లాక్‌ రిటర్నింగ్‌ అధికారులూ (బీఆర్‌వో) పాల్గొన్నారు.  ఈనెల 10 నుంచి వారంతా తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీల ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తారు. 

బూత్‌ ప్రెసిడెంట్ల నుంచి
ఏఐసీసీ షెడ్యూల్లో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ ఉండదు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మండల వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఈ రెం డు రాష్ట్రాల్లో మాత్రమే మండల కాంగ్రెస్‌ అధ్యక్షులను కూడా ఎన్నుకునే పద్ధతి సం ప్రదాయంగా వస్తోంది. రాష్ట్రంలోని 34,865 పోలింగ్‌ బూత్‌ల అధ్యక్షులు, ఆ బూత్‌ నుంచి మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులుగా ఉన్న ఇద్దరు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మండలంలోని 20–25 పోలింగ్‌ బూత్‌ల అధ్యక్షులతోపాటు మండల కాంగ్రెస్‌ ప్రతినిధులు కలిసి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు, కమిటీలను రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో ఎన్నుకుంటారు. అదేవిధంగా బ్లాక్‌ కాంగ్రెస్‌ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇక, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, కమిటీలను ఎన్నుకుంటారు. ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులతోపాటు ప్రతి బ్లాక్‌ నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉండే ఇద్దరు ప్రతినిధులు కలిసి పీసీసీ ప్రతినిధులను ఎన్నుకుంటారు. దీంతో  ఎన్నికల తంతు ముగుస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement