కర్ణాటక బిల్లు తరహాలో త్వరలో చట్టం?
సోషల్ మీడియా, మీడియాలో ద్వేషపూరిత ప్రసంగాలు,వార్తల కట్టడిపై ప్రభుత్వం దృష్టి
ఇప్పటికే సిట్ ఏర్పాటుతో ఆ దిశగా కీలక అడుగు
సిట్ నివేదికను ఆధారంగా చేసుకుని కొత్త చట్టానికి రూపకల్పన!
సాక్షి, హైదరాబాద్: విద్వేష పూరిత ప్రసంగాలు, వార్తల ప్రచారాన్ని కట్టడి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. ప్రభుత్వంలో ఉండే కీలక వ్యక్తులు, అధికారులే లక్ష్యంగా ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే నిరాధార ఆరోపణలు, విమర్శలకు చెక్ పెట్టేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన బిల్లు (విద్వేష పూరిత ప్రసంగాలు, ద్వేష పూరిత నేరాల (నివారణ) బిల్లు, 2025) తరహాలో ప్రత్యేక చట్టం తేవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇప్పటికే ఈ అంశాలను పరిశీలించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఆరోపణలతో ఓ న్యూస్ చానల్‌లో ప్రసారమైన వార్త, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూప్‌లలో ప్రచారం చేయడంపై నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్‌స్టేషన్‌లో వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగిస్తూ డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విద్వేష పూరిత ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందనే విషయం ఈ సిట్ ఏర్పాటుతో స్పష్టం అవుతోంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇలాంటి కేసులు ఏవైనా నమోదయ్యాయా అని సిట్ బృందం పరిశీలించే అవకాశం ఉంది. నిరాధార ఆరోపణలు చేయడానికి కారణాలు ఏంటి..? తెరవెనుక ఇంకెవరైనా వ్యక్తులు ఉండి చేయిస్తున్నారా? అన్నది నిగ్గు తేల్చే దిశగానే సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు అయ్యిందని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. సిట్ బృందం గుర్తించే అంశాలను ఆధారంగా చేసుకుని కర్ణాటక తరహాలో చట్టం తేవడానికి అవకాశం ఉందని ఆయన చెప్పారు.
కర్ణాటక బిల్లులో ఏముంది..?
కర్ణాటక ‘హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ నివారణ బిల్లు–2025’లో అనేక కీలక అంశాలున్నాయి. సమాజంలో మతం, కులం, జాతి, లింగం, భాష తదితర అంశాల ఆధారంగా విద్వేషాలు, ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యలను అరికట్టే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాలను నియంత్రించడంతోపాటు అటువంటి నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు విధించడం, బాధితులకు తగిన పరిహారం అందించడం లక్ష్యంగా దీనికి రూపకల్పన చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
బహిరంగ ప్రదేశాల్లో లేదా ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మాటలతో, రాతలతో, సంకేతాలతో లేదా దృశ్య రూపాల్లో వ్యక్తి లేదా వర్గంపై ద్వేషం, శత్రుత్వం, వైరం రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసే వ్యాఖ్యలను ‘విద్వేష ప్రసంగం’గా పరిగణిస్తామని బిల్లులో పేర్కొన్నారు. మతం, జాతి, కులం, లింగం, లైంగిక అభిముఖ్యత, జన్మస్థలం, నివాసం, భాష, వైకల్యం, గిరిజన గుర్తింపు వంటి అంశాలపై పక్షపాతం చూపితే అది నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్ని కాగి్నజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు.
ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ కోర్టులో విచారణ జరుగుతుంది. ద్వేష నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ముందుగానే గుర్తిస్తే ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ లేదా డిప్యూటీ ఎస్పీ హోదాకు తక్కువ కాని పోలీసు అధికారి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ద్వేషాన్ని ప్రోత్సహించే కంటెంట్‌ను సోషల్ మీడియా, ఎల్రక్టానిక్ మీడియా నుంచి తొలగించేందుకు లేదా బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ద్వేష నేరానికి ఏదైనా సంస్థ లేదా సంఘం పాల్పడితే, ఆ సంస్థతో పాటు దాని నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారిపై కూడా కేసులు నమోదు చేస్తారు.
కఠిన శిక్షలు
⇒ ద్వేష నేరానికి పాల్పడితే కనీసం ఒక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారు.
⇒ అదే నేరాన్ని పునరావృతం చేస్తే కనీసం రెండేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.1 లక్ష జరిమానా ఉంటుంది.
⇒ బాధితులకు నష్టం తీవ్రతను బట్టి న్యాయస్థానం తగిన పరిహారం ఇవ్వవచ్చు.


