తొమ్మిదేళ్ల తర్వాత నామకరణం

Telangana CM KCR Named Nine Years Child - Sakshi

సీఎం కేసీఆర్‌తో పేరు పెట్టించాలని ఇన్నాళ్లు వేచి చూసిన తల్లిదండ్రులు

మహతిగా నామకరణం చేసి  తల్లిదండ్రుల ముచ్చట తీర్చిన సీఎం కేసీఆర్‌ 

ఆశీర్వదించి కానుకలు అందజేసిన సీఎం దంపతులు

సాక్షి, హైదరాబాద్‌/భూపాలపల్లి రూరల్‌: ముఖ్య­మంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోనే తమ బిడ్డకు పేరుపెట్టించాలనుకున్న ఆ తల్లిదండ్రుల సంక­ల్పం నెరవేరింది. తొమ్మిదేళ్ల కల ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామకు చెందిన జనగాం సురేశ్, అనిత దంపతులు 2013లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి సీఎం కేసీఆర్‌తోనే నామకరణం చేయించుకోవాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం చిట్టి అనే ముద్దు పేరుతో ఐదో తరగతి చదువుతున్న ఆ బిడ్డకు ఇప్పటివరకు పేరుపెట్టకుండానే పెంచుతున్న విషయాన్ని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి తెలుసుకున్నారు.

దీంతో వారిని ఆదివారం ప్రగతి భవన్‌కు తోడ్కొని వచ్చారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులు, సురేష్‌ అనితల బిడ్డకు..‘మహతి’అని నామకరణం చేశారు. సీఎం దంపతులు వారికి బట్టలుపెట్టి ఆతిథ్యమిచ్చారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు. తమను ఆదరించి ఆశీర్వదించిన తీరుకు, సురేష్‌ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆ బిడ్డను ఇప్పటివరకు ఇంట్లో చిట్టి, బంధువులు కేసీఆర్‌ అని, కొంతమంది స్వీటీ అని పిలిచేవారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top