
సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రామకృష్ణారావు, వేం నరేందర్‌రెడ్డి
భూసేకరణ, పరిహారం పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు
కలెక్టర్లు, ఆర్డీవోలకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక... అక్టోబర్ కల్లా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల పనులు ఒకేసారి ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ఏఐకి విజ్ఞప్తి
పలు ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులకు సంబంధించిన భూ సేకరణ, పరిహారం ఖరారు, పంపిణీ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపై వేటు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం జరగడం సరికాదని అన్నారు. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. భూసేకరణ, పరిహారం పంపిణీని అక్టోబర్ నెలాఖరుకల్లా కచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని, అదే సమయంలో రోడ్ల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించడం ద్వారా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
సోమవారం సచివాలయంలో.. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్)తో పాటు ఇతర శాఖలు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రహదారులకు భూ సేకరణ, పరిహారం పంపిణీలో జాప్యంపై జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. ‘కాలా’(కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్) నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని వారు చెప్పారు.
అయితే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిధులు వెంటనే విడుదల చేస్తున్నామని, కలెక్టర్లు పనులు త్వరగా చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం.. కలెక్టర్లు, సంబంధిత ఇతర అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్లు చెప్పగా, వారంలోపు అడ్వకేట్ జనరల్‌తో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు.
ఎప్పటికప్పుడు కొత్త కొర్రీలెందుకు?
ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగంపై కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను ఎందుకు లేవనెత్తుతున్నారని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సీఎం ప్రశ్నించారు. సందేహాలన్నింటినీ ఒకేసారి పంపాలని సూచించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలను వేర్వేరు ప్రాజెక్టులుగా చూడొద్దని, రెండింటికీ ఒకే జాతీయ రహదారి నంబరు కేటాయించాలని, వెంటనే అనుమతులు మంజూరు చేసి ఏకకాలంలో పనులు ప్రారంభించాలని కోరారు.
వెంటనే అనుమతులివ్వండి
భారత్ ఫ్యూచర్ సిటీ–అమరావతి–మచిలీపట్నం 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ముఖ్యమంత్రి కోరారు. ఈ రహదారికి సమాంతరంగా రైలు మార్గం కూడా నిర్మించాలని, బెంగళూరు–శంషాబాద్ ఎయిర్‌పోర్ట్–అమరావతి మధ్య రైలు మార్గం అవసరమని అన్నారు. హైదరాబాద్–శ్రీశైలం మార్గంలో రావిర్యాల–మన్ననూర్ ఎలివేటెడ్ కారిడార్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. హైదరాబాద్–మంచిర్యాల–నాగ్‌పూర్ నూతన రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమరి్పంచిన ప్రతిపాదనలనే అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. పలు జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి అటవీ, పర్యావరణ శాఖ అభ్యంతరాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
‘వన్య ప్రాణులు లేనిచోట కూడా ఆ చట్టం అమలు’
2002 నుంచి 2022 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అట వీ, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని, దాంతో ప్రస్తుతం అనుమతులు ఇవ్వడం లేదని ఫారెస్ట్ సౌత్ రీజియన్ ఐజీ త్రినాథ్‌కుమార్ చెప్పగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. అవసరమైనచోట అడవి పెంపకానికి ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని, దీనిపై కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్‌లతో భేటీ అవుతానని తెలిపారు.
వన్యప్రాణులు లేని అటవీ ప్రాంతాల్లోనూ వన్య ప్రాణుల చట్టం అమలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇలావుండగా..తమ కార్యాలయ నిర్మాణానికి హైదరాబాద్‌లో రెండు ఎకరాల భూమి కేటాయించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ముఖ్యమంత్రిని కోరగా, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.