Telangana: సర్కారీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచే ఆంగ్లంలో విద్యా బోధన 

Telangana Cabinet Meeting: KCR Govt Brings New Education Act - Sakshi

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం

ఈ రెండు అంశాలపై అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘం

రూ.7,289 కోట్లతో ‘మన ఊరు–మన బడి’ ప్రణాళిక

నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

రాష్ట్రంలో మహిళా, అటవీ వర్సిటీలు

మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.

ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి  విద్యను మరింత చేరువ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై సమగ్ర అధ్యయనం జరపడంతో పాటు విధివిధానాల రూపకల్పన కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, జగదీశ్‌ రెడ్డి, హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కె.తారక రామారావుతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. వచ్చే శాసనసభా సమావేశాల్లో ఈ మేరకు నూతన చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుంది.

మరోవైపు నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘మన ఊరు–మన బడి’ ప్రణాళిక అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

అదుపులోనే కరోనా: హరీశ్‌రావు
    రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు. రాష్ట్రంలో 5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ జరిగిందని, అర్హులైన అందరికీ త్వరగా టీకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు  గుంపులుగా గుమిగూడకుండా స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. 

సంపూర్ణంగా ధాన్యం కొనుగోళ్లు 
    వానాకాలంలో పండిన ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్‌ చర్చించింది. ఇప్పటికే చాలాచోట్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావచ్చినా, అకాల వర్షాలతో కొన్ని జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. అందువల్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. ఇలావుండగా ఇటీవల అకాల వర్షాల వల్ల తీవ్ర పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పర్యటించాలని తీర్మానించింది.

బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యార్థులకు రిజర్వేషన్లు
    సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల.. పరిశోధన సంస్థలో (ఎఫ్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్‌) నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్‌ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్లను ప్రభుత్వం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ చదివిన విద్యార్థులకు అటవీశాఖ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటా కింద రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు (ఏసీఎఫ్‌) పోస్టుల్లో 25 శాతం, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌ఓ), ఫారెస్టర్స్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ రూల్స్‌–1997, తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌–2000కు సవరణలు చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో ఫారెస్ట్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకరించింది. అటవీశాఖ అధికారులు ప్రాథమిక నివేదికను అందించగా, వచ్చే కేబినెట్‌ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికతో రావాలని ఆదేశించింది. కాగా రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తదుపరి మంత్రివర్గ సమావేశం ముందు పూర్తిస్థాయి ప్రతిపాదనలను ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌ రద్దు
    మంత్రివర్గ భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ విలేకరుల సమావేశం నిర్వహిస్తారని సీఎం కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం  ఆహ్వానం రావడంతో మీడియా ప్రతినిధులు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. నేషనల్‌ మీడియాకు సీఎంఓ నుంచి సోమవారం ఉదయమే కబురు అందింది. దీంతో కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై ప్రధానంగా మాట్లాడతారనే చర్చ జరిగింది. ఢిల్లీ నుంచి కూడా కొందరు విలేకరులు వచ్చారు. అయితే చివరిలో ఈ విలేకరుల సమావేశం రద్దైనట్టు సీఎంఓ ప్రకటించింది. కేబినెట్‌లో చర్చించాల్సిన ఎజెండా అంశాలు ఎక్కువగా ఉన్నందున, సమావేశం ఎక్కువసేపు కొనసాగే అవకాశమున్న పరిస్థితుల్లో, మీడియాకు అసౌకర్యం కలగరాదనే ఉద్దేశంతో అనివార్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రెస్‌ మీట్‌ రద్దు చేసినట్టు వివరణ ఇచ్చింది. 

ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలి
    విద్యారంగంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో.. పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని కేబినెట్‌ గుర్తించింది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన చేపట్టినట్టయితే తమ పిల్లలను స్థానిక పాఠశాలల్లోనే చేర్పించేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారని భావించింది. ఈ నేపథ్యంలోనే సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అందుకు కావలసిన అన్ని రకాల  మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిషు మీడియంలో బోధించేందుకు టీచర్లకు తర్ఫీదునిచ్చేందుకు, నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించడం ద్వారా ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖను ఆదేశించింది.

సర్కారీ స్కూళ్లకు కొత్త సొబగులు
    రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు వీలుగా ‘మన ఊరు – మన బడి’ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత విద్యను అందించడం కోసం డిజిటల్‌ క్లాస్‌ రూంలు, అదనపు తరగతి గదులు, అవసరమైన మేరకు ఫర్నిచర్‌ ఏర్పాటు, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర వసతుల కల్పన ఈ ప్రణాళిక ఉద్దేశం. సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం.. గతంలో రెండుసార్లు సమావేశమైన సబిత నేతృత్వంలోని మంత్రుల బృందం ‘మన ఊరు – మన బడి’ విధివిధానాలను రూపొందించింది.

12 రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు ప్రతిపాదించడం జరిగింది. అవి.. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, త్రాగు నీటి సరఫరా, విద్యార్థులు మరియు సిబ్బందికి సరిపడ ఫర్నిచర్, పాఠశాల మొత్తానికి కొత్తగా రంగులు వేయడం, పెద్ద ..చిన్న మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీ గోడలు,  వంట గదులు (షెడ్లు), శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు, ఉన్నత పాఠశాలల్లో భోజనశాలలు, డిజిటల్‌ విద్య అమలు. ఇందుకు రూ.7,289.54 కోట్లు అవసరమవుతాయి. అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం ‘పాఠశాల నిర్వహణ కమిటీ’ (ఎస్‌.ఎమ్‌.సి.)లకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. ప్రతి స్కూల్లో పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top