మేడారంలోని ల్యాండ్ స్కేపింగ్ ఆర్చ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు గడ్డం వివేక్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, మహ్మద్ అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్
మేడారంలో కేబినెట్ కీలక నిర్ణయాలు
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ
బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం సర్క్యూట్
మెట్రో రెండో దశ భూసేకరణకు రూ.2,787 కోట్లు
మహాత్మాగాంధీ వర్సిటీలో లా, ఫార్మసీ కళాశాలలకు అనుమతి
వెల్లడించిన మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లతో వాటిలోని 2,999 వార్డులు/డివిజన్లకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం ఇప్పటికే మేయర్/చైర్మన్, కార్పొరేటర్/కౌన్సిలర్ పదవులకు సంబంధించి రిజర్వేషన్లను ప్రకటించింది. ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న శివరాత్రి, 16 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుండగా, ఆలోగా విద్యార్థులకు పరీక్షలు సైతం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు ఇబ్బందులు రాకుండా షెడ్యూల్ రూపొందించాలని సూచించింది. ములుగు జిల్లా మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో ఆదివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం మేడారంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. కేబినెట్ భేటీ వివరాలను సమాచార, ప్రజాసంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్కతో కలిసి అక్కడే మీడియాకు వెల్లడించారు.
టెంపుల్ సర్క్యూట్...
2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనుండటంతో ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను ‘టెంపుల్ సర్క్యూట్’పేరుతో ఎకో–టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని తీర్మానించింది. ప్రణాళిక తయారీకి త్వరలో మంత్రివర్గ ఉపసంఘం వేయాలని నిర్ణయించింది. దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురాతత్వ శాఖలు సంయుక్తంగా ఫిబ్రవరి తొలివారం నాటికి సమగ్ర నివేదికను అందిస్తాయని మంత్రి పొంగులేటి తెలిపారు. మార్చి 31 నాటికి మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని తీర్మానించామని, నివేదిక తయారీకి కన్సల్టెన్సీని సైతం ఖరారు చేసినట్టు చెప్పారు.
⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థలకు 14 ప్రాంతాల్లో మార్కెట్ ధర ఆధారంగా భూములు కేటాయించాలని నిర్ణయించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎస్‌బీఐ కార్పొరేట్ కార్యాలయం నిర్మాణానికి వరుసగా 20, 17 కుంటల భూమిని మార్కెట్ ధరకు కేటాయించనున్నారు.
⇒ హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు సంబంధించి ఇంతవరకు జరిగిన పురోగతిని కేబినెట్ సమీక్షించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, తదుపరి చర్చ కోసం వచ్చే మంత్రివర్గ సమావేశం ముందు ఫైల్‌ను పెట్టాలని ఆదేశించింది. ‘మెట్రో ఫేజ్–2ఏ’నాలుగు కారిడార్లు, ‘ఫేజ్–2బీ’కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోపు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుని రూ.2,787 కోట్ల అంచనాలతో భూ సేకరణ ప్రతిపాదనలను ఆమోదించింది.
⇒ హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ డెవలప్‌మెంట్‌కు టీజీఐఐసీకి 494 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
⇒ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు కొత్తగా 9 కి.మీ. రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం.
⇒ నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో న్యాయ, ఫార్మసీ కాలేజీల ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. లా కళాశాలకు 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీకి 28 కొత్త పోస్టులు మంజూరు చేసింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రిజిస్ట్రార్ పోస్టు మంజూరు చేసింది.
⇒ ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో హామ్ విధానంలో రూ.11,334 కోట్లతో 6 వేల కి.మీ. రహదారుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను వేగిరం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.6వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్ల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో మట్టి రోడ్డు కనిపించదన్నారు.
⇒ ములుగు జిల్లాలో కొత్తగా రూ.143 కోట్లతో పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెర్వులు కుంటలను నింపడంతోపాటు 7,500 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించనుంది. రూ.143 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకం చేపట్టనుంది. భవిష్యత్తులో 15–20వేల ఎకరాలకు ఆయకట్టును పెంచే అవకాశం ఉందని మంత్రి సీతక్క వెల్లడించారు.
తిరుపతి, కుంభమేళాను మరిపించే రీతిలో మేడారం
తిరుపతి, కుంభమేళాను మరిపించేవిధంగా మేడారం ఆలయాన్ని అద్భుత పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల సమక్షంలో పునరుద్ధరించిన ఆలయాన్ని ప్రారంభిస్తారన్నారు. ఆలయాభివృద్ధికి 19 ఎకరాలను సేకరించగా, మరో 21–22 ఎకరాలు సేకరించనున్నామన్నారు.
41–42 ఎకరాలను ఆలయం పేరుతో సేకరించి ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జంపన్నవాగులో 365 రోజులు నీళ్లు ఉండేలా రామప్ప పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను లక్నవరంకు తరలించి అక్కడి నుంచి జంపన్న వాగుకు తీసుకురావాలని సీఎం రేవంత్ ప్రకటించారని గుర్తుచేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తిశ్రద్ధలతోనే గద్దెలు, ప్రాకారాలు తయారు చేయించామని, రాజకీయంతో కాదని విలేకరుల ప్రశ్నకు పొంగులేటి బదులిచ్చారు. మీడియా సమావేశంలో ఎంపీ బలరామ్ నాయక్ పాల్గొన్నారు.


