
న్యూఢిల్లీ, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో.. తెలంగాణ రాజకీయం హైదరాబాద్ నుంచి హస్తినకు మారింది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉండనున్న నేపథ్యంలో మంత్రి పదవుల కోసం ఆశావహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తో అధిష్టానం చర్చలు పూర్తి చేసినప్పటికీ ‘చివరి అవకాశం’గా భావిస్తున్న కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో.. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చ నడుస్తోంది. తెలంగాణ కేబినెట్‌లో చోటు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తోంది. ఎలాగైనా మంత్రిపదవిని ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ పెద్దల ఇల్లు, కార్యాలయాల చుట్టూ కొందరు ఎమ్మెల్యేలు పదే పదే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, బాలు నాయక్ , మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహా పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు కేబినెట్‌లో చోటు కల్పించాలని మాధవరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశం తర్వాత ఆయన అధిష్టాన పెద్దలను కలుస్తారని సమాచారం.
మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ ముసాయిదాపై జరగున్న సమావేశంలో పాల్గొననున్న భట్టి.. జాతీయ నేతలను కలసి మంత్రివర్గంలో తన వారి కోసం ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది. మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో నాలుగు నుంచి ఐదు భర్తీ చేస్తారని తెలుస్తోంది. అతిత్వరలోనే(ఏప్రిల్ 3వ తేదీ అని ప్రచారం) మంత్రివర్గ విస్తరణ ఉండనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.