పది రోజులపాటు శాఖల వారీగా సమావేశాలు
ఉపముఖ్యమంత్రి భట్టి అధ్యక్షతన సమీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్– 2026 సమావేశాలు ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రస్తుతం శాఖలవారీగా బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలు ప్రగతి పద్దు, నిర్వహణ పద్దుకు సంబంధించి అంచనాలను ప్రాథమికంగా తయారు చేసింది. ఈ అంచనాలపై ఈనెల 24 నుంచి సచివాలయంలో రాష్ట్ర బడ్జెట్–2026 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చలు జరపనున్నారు.
సంబంధిత మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్లలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగుతాయి. ఇందుకు సంబంధించి భట్టి ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల వారీగా ఖరారు చేసిన సమీక్షల షె డ్యూల్‌ను ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి సందీప్ కుమార్ సుల్తానియా నోట్ జారీ చేశారు. ఈ ఆదేశాలను సంబంధిత మంత్రులు, ప్రభుత్వ శాఖలకు పంపించారు.
పాత, కొత్త పథకాలపై చర్చ
బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో ప్రభుత్వ శాఖలు రూపొందించిన అంచనాల ఆధారంగా చర్చిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, డిమాండ్‌కు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతోపాటు ప్రభుత్వం ఇచి్చన హామీలకు అనుగుణంగా కొత్తగా అమలు చేయాల్సిన పథకాలపైనా చర్చించనున్నారు. పాత పథకాలకు బడ్జెట్ డిమాండ్‌తో పాటు కొత్త పథకాలకు బడ్జెట్ అవసరాలపై అంచనాకు రానున్నారు. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖతో పాటు సాధారణ పరిపాలన విభాగం, హోం, లా అండ్ ఆర్డర్, న్యాయ తదితర శాఖలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతుండటంతో ఆయా సమావేశాలకు సీఎం అధ్యక్షత వహిస్తారు. సమీక్షల అనంతరం కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్పులు చేస్తారు.


