డ్రక్స్‌ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు మీవారే!

Telangana Bjp President  Bandi Sanjay Sensational Comments On  Trs Leaders - Sakshi

బండి సంజయ్‌ డిమాండ్‌

తెలంగాణలో బీసీ వ్యతిరేక పాలన: కె.లక్ష్మణ్‌   

మల్కాజిగిరి: తెలంగాణలో బీసీ వ్యతిరేక పాలన సాగుతోందని బీజేపీ ఓబీసీ జాతీయ విభాగం అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి పద్మావతి ఫంక్షన్‌ హాల్‌లో రాష్ట్ర ఓబీసీ విభాగం కార్యవర్గ భేటీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్‌ మాట్లాడుతూ, దశాబ్దాలపాటు పరిపాలించిన కాంగ్రెస్‌ కూడా బీసీలకు ద్రోహమే చేసిందని, మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాతనే బీసీలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. రాష్ట్రంలో పెత్తందార్ల, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే బీసీలు ఐక్యం కావాల్సిన అవసరముందన్నారు. 

గడీల రాజ్యాన్ని బద్దలుకొట్టాలి.. 
రాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా గడీల రాజ్యం నడుస్తున్నదని దానిని బద్దలు కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కర్ణాటక డ్రగ్స్‌ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారని, కేసీఆర్‌ వారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. వారిలో ఇద్దరు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారన్నారు. 50 శాతం పైగా బీసీ జనాభా ఉన్న రాష్ట్రంలో ఇద్దరే మంత్రులు ఉన్నారని ఆయన విమర్శించారు. కులవృత్తులకు ద్రోహం చేస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీయేనని, ఎక్కడ చూసినా వారే దుకాణాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

జాతీయ ఓబీసీ కమిషన్‌ సభ్యుడు ఆచార్య మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరిగితే వారి పక్షాన కమిషన్‌ నిలబడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి, సునీతాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top