జలాశయాన్ని ఖాళీ చేసేందుకు టెక్నికల్ కమిటీ ఏర్పాటు
డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ నివేదికపై సర్కారు స్పందన
ఖాళీ చేస్తే వచ్చే యాసంగిలో ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే
అవసరమైతే ఆ తర్వాతి సీజన్‌కి సైతం పొడిగింపు
డీఎస్‌ఆర్‌పీ హెచ్చరికలను విస్మరిస్తే తీవ్ర విపత్తేనని తెలిపిన ఇరిగేషన్ శాఖ
డిసెంబర్‌లో పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలకు సాగు, తాగునీటిని సరఫరా చేసే కీలకమైన సింగూరు జలాశయాన్ని పూర్తిగా ఖాళీ చేసి, మరమ్మతులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ జలాశయానికి మరమ్మతులు నిర్వహించకపోతే ఏ క్షణంలోనైనా జలాశయం తెగిపోయి దిగువ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశముందని ఇటీవల డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్‌ఆర్‌పీ) తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం మరమ్మతులకు ఉపక్రమించింది. డీఎస్‌ఆర్‌పీ గత మార్చి 23న సింగూరు జలాశయాన్ని సందర్శించి, దాని నిర్వహణలో లోపాల పట్ల తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేసింది. జలాశయాన్ని పూర్తిగా (క్రెస్ట్ లెవల్‌కి) ఖాళీ చేసే పనుల పర్యవేక్షణకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా.. నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) నేతృత్వంలో ఏడుగురు అధికారులతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ గత శనివారం మెమో జారీ చేశారు.
జలాశయాన్ని ఖాళీ చేస్తే హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు తాగునీటి సరఫరాపై ఏర్పడే ప్రభావం, ప్రత్యామ్నాయ వనరులపై అధ్యయనం జరిపి వారంలోగా ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. కమిటీ నివేదిక అందిన తర్వాత జలాశయాన్ని ఖాళీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. జలాశయాన్ని ఖాళీ చేస్తే దాని కింద ఉన్న 40 వేల ఎకరాల ఆయకట్టుకు వచ్చే యాసంగిలో క్రాప్ హాలీడే ప్రకటించనున్నారు. డిసెంబర్‌లో పనులు ప్రారంభించి, 2026 జూలై నాటికి పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది.
పనులు పూర్తికాకుంటే ఆ తర్వాతి వానా కాలం సీజన్‌లో సైతం పంటలకు క్రాప్‌హాలీడే ప్రకటించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ నివేదించింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు గ్రామంలో 29.91 టీఎంసీల సామర్థ్యంతో 1976లో సింగూరు జలాశయం నిర్మాణాన్ని ప్రారంభించగా, 1980లో పూర్తయింది.
డ్యామ్ సేఫ్టీ హెచ్చరికలను విస్మరిస్తే విపత్తే..
సింగూరు జలాశయం తీవ్ర ముప్పు ఎదుర్కొంటోందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చేసిన హెచ్చరికలను విస్మరిస్తే తీవ్ర విపత్తు చోటుచేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపా రుదల శాఖ నివేదించింది. ప్రభుత్వం సకాలంలో అనుమ తిస్తే డిసెంబర్‌లో పనులు ప్రారంభించి వచ్చే ఏడాది జూలై లో పూర్తి చేస్తామని తెలియజేసింది. అవసరమైతే ఇంకో సీజ న్ పనులు చేసుకుంటామని తెలిపింది.
జలాశయం దీర్ఘ కాలిక భద్రతకు మరమ్మతులు నిర్వహించకతప్పదని స్పష్టం చేసింది. ‘సింగూరు జలాశయానికి ఎగువ మట్టి కట్టల (అప్ స్ట్రీమ్ ఎర్త్ డ్యామ్)కు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివి ట్‌మెంట్‌తో పాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమ య్యా యి. చాలా చోట్లలో అప్‌స్ట్రీమ్ స్లోప్‌కి రక్షణగా ఉండే రివిట్‌మెంట్ దెబ్బతిన్నది. ఒరిజినల్ డిజైన్ల ప్రకారం జలాశయంలో నిల్వలు 517.8 మీటర్లకి మించకుండా నిర్వ హించాలి. కానీ దీనికి విరుద్ధంగా మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్లకు తగ్గకుండా నిల్వలను నిర్వహించాలని 2017 అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 885 జారీ చేసింది.
ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా సామర్థ్యానికి మించి నిరంతరంగా 522 మీటర్ల మేర నిల్వలను కొనసాగిస్తుండటంతో జలాశయం తీవ్రంగా దెబ్బతిన్నది. అప్‌స్ట్రీమ్ రివి ట్‌మెంట్‌కు మరమ్మతులు నిర్వహించి, పూర్వస్థితికి పునరు ద్ధరించకపోవడంతో జలాశయం కట్టలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. అత్యవసరంగా రివిట్‌మెంట్‌కి మరమ్మతులు నిర్వ హించి, పునరుద్ధరించకపోతే ఏక్షణంలోనైనా మట్టి కట్టలకు గండిపడి లోతట్టు ప్రాంతాలను ముంచేసే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తి నష్టంతో పాటు జలాశయానికి తీరని నష్టం జరగనుంది.
సింగూరు జలాశయానికి దిగువన ఉన్న మంజీర, నిజాంసాగర్ జలాశయాలతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న చెక్‌డ్యామ్‌లూ తెగిపోయి నష్టం తీవ్రత మరింత పెరుగుతుంది’అని డీఎస్‌ఆర్పీ తన నివేదికలో పొందుపరిచిన అంశాలను నీటిపారుదల శాఖ సర్కారు దృష్టికి తీసుకెళ్లి జలాశయాన్ని ఖాళీ చేసేందుకు అనుమతి కోరింది.
శాశ్వత మరమ్మతులకు రూ.61.5 కోట్లు అవసరం..
సింగూరు జలాశయానికి తక్షణ మరమ్మతులకు రూ.16.08 కోట్లు అవసరం కానుండగా, ఖాళీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. డీఎస్‌ఆర్‌పీ సిఫారసుల మేరకు శాశ్వత పునరుద్ధరణ పనులు నిర్వహించడానికి రూ.61.5 కోట్ల నిధులు అవసరమని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది.


