పదోన్నతుల్లో పంచాయితీ | Teachers unions plan to go to court in Telangana | Sakshi
Sakshi News home page

పదోన్నతుల్లో పంచాయితీ

Jun 30 2025 1:22 AM | Updated on Jun 30 2025 1:22 AM

Teachers unions plan to go to court in Telangana

2 వేల మందికిపైగా టీచర్ల ప్రమోషన్లకు ఫైల్‌ రెడీ 

2, 3 రోజుల్లో ఉత్తర్వులకు అవకాశం 

అభ్యంతరం వ్యక్తం చేస్తున్న 2023 జీహెచ్‌ఎంలు.. తొలుత బదిలీలు చేపట్టి తమకూ చాన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ 

కోర్టుకెళ్లే యోచనలో ఉపాధ్యాయ సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల పదోన్నతులకు రంగం సిద్ధమైంది. పదవీ విరమణ పొందిన, మరణించిన వారి వల్ల ఏర్పడిన ఖాళీలన్నీ భర్తీ కానున్నాయి. పాఠశాల విద్య డైరెక్టరేట్‌ కార్యాలయం దీనికి సంబంధించిన ప్రతిపాదనలను గత వారం ప్రభుత్వానికి పంపింది. రెండు, మూడురోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే వీలుంది. 

స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) నుంచి గెజిటెడ్‌ హెచ్‌ఎం (జీహెచ్‌ఎం)లుగా పదోన్నతులు పొందుతున్న వాళ్ళు దాదాపు 700 మంది వరకూ ఉన్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీ) స్థాయి నుంచి ఎస్‌ఏగా పదోన్నతి పొందుతున్న వాళ్ళు 1,500 వరకూ ఉంటారు. హైదరా బాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 750 వరకూ జీహెచ్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా జరుగుతుందా? అనే సందేహాలు విద్యాశాఖను వెంటాడుతున్నాయి.  

జీహెచ్‌ఎంల నుంచి అభ్యంతరాలు 
ముందుగా బదిలీలు చేపట్టకుండా, పదోన్నతులు కల్పించనుండటంపై జీహెచ్‌ఎంలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియపై న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత 2023లో ప్రమోషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో 994 మంది స్కూల్‌ అసిస్టెంట్లు ప్రమోషన్లు పొందారు. మల్టీజోన్‌ పదోన్నతి కావడంతో వీరంతా సొంత జిల్లాల నుంచి రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. 

అన్ని ప్రాంతాల వాళ్ళూ 100 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో పనిచేయాల్సి వస్తోంది. కాగా జీహెచ్‌ఎం బదిలీ కోరుకోవాలంటే పనిచేస్తున్న స్కూల్‌లో కనీసం రెండేళ్ళ సర్వీస్‌ పూర్తిచేసి ఉండాలి. గరిష్టంగా 5 ఏళ్ళు నిండితే ప్రభుత్వమే బదిలీ చేయడానికి హక్కు ఉంటుంది. 

ఇక్కడే అసలు సమస్య వచ్చింది. పదోన్నతుల ద్వారా 2023లో దూర ప్రాంతాలకు వెళ్ళిన టీచర్లకు ఇంకా రెండు నెలలు పూర్తయితేనే బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత వస్తుంది. ఈ నేపథ్యంలోనే పదోన్నతులపై జీహెచ్‌ఎంలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  

కోర్టుకెళ్ళే యోచనలో హెచ్‌ఎంలు 
ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని జీహెచ్‌ఎంలు అంటున్నారు. ఇప్పుడు తమకు బదిలీ అవకాశం ఇవ్వకపోతే కొత్తగా పదోన్నతులు పొందేవారు జీహెచ్‌ఎం పోస్టుల్లో భర్తీ అవుతారని, అప్పుడు తాము సొంత జిల్లాలకు రాకుండా దూర ప్రాంతాల్లోనే రిటైర్‌ అవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. 2023లో ప్రమోషన్లు ఇచ్చేనాటికే 90 శాతం హెచ్‌ఎంలు రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నారని, వయోభారంతో ఉన్న వాళ్ళు దూర ప్రాంతాల్లో ఎలా పనిచేస్తారని ప్రశ్నిస్తున్నారు. 

చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని, కుటుంబాలు సొంత జిల్లాల్లో ఉండగా, తాము పనిచేసే ప్రాంతాల్లో ఒంటరిగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకుంటుందని భావించామని, కానీ ఈ ప్రయత్నాలు ఫలించలేదని, దీంతో కోర్టును ఆశ్రయించడమే ఏకైక మార్గమని స్పష్టం చేస్తున్నారు.  

ముందుగా బదిలీలు చేపట్టాలి 
ముందుగా బదిలీలు చేపట్టాలి. ఆ తర్వాతే పదోన్నతులు ఇవ్వాలి. 2023లో దూర ప్రాంతాలకు వెళ్ళిన హెచ్‌ఎంలకు బదిలీల్లో అవకాశం కల్పించాలి. కనీస అర్హత వయసును ఏడాదికి తగ్గించాలి. ఇంకో రెండు నెలల్లో వీరి బదిలీకి అర్హత వస్తుందని తెలిసీ, ఎస్‌ఏలకు ప్రమోషన్లు ఇవ్వడం అన్యాయం. దీనివల్ల అనేక మంది హెచ్‌ఎంలకు ఇబ్బంది కలుగుతుంది.  
– ఆర్‌.రాజగంగారెడ్డి (తెలంగాణ గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు)  

ప్రమోషన్ల హక్కును అడ్డుకోవద్దు 
గెజిటెడ్‌ ఉపాధ్యాయుల డిమాండ్‌ ఆమోదయోగ్యమే. దూర ప్రాంతాల హెచ్‌ఎంలు సొంత జిల్లాలకు రావాలనుకోవడమనేది వారికున్న ఒక హక్కుగానే చూడాలి. కానీ కొత్తవారికి ప్రయోషన్లు కూడా వారి హక్కు అని మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా బదిలీలు చేపట్టాలి.  
– చావా రవి (టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు) 

ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు :  
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కానీ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉపాధ్యాయ సంఘాల భిన్న వాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. 
– డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ (పాఠశాల విద్య డైరెక్టర్‌)  

Advertisement
 
Advertisement
Advertisement