గడ్డిపోచ పిరం! | Struggles of dairy farmers for dry fodder | Sakshi
Sakshi News home page

గడ్డిపోచ పిరం!

Oct 25 2026 6:06 AM | Updated on Oct 25 2026 6:07 AM

Struggles of dairy farmers for dry fodder

ఎండుగడ్డి కోసం పాడి రైతుల తిప్పలు

వర్షాభావ పరిస్థితులతో పెరిగిన డిమాండ్‌

వరిసాగు తగ్గడంతో మేతకు రూ. వేల ఖర్చు

5 వేలకుపైగా గ్రామాల్లో 73 లక్షల పశువులపై ప్రభావం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వర్షాభావ పరిస్థితులు పాడి రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వానల్లేక ఆవులు, గేదెలకు పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. వరి కోతల ఆరంభంలోనే ఎండుగడ్డికి డిమాండ్‌ పెరుగుతోంది. మళ్లీ వర్షాలు కురిసే దాకా పాలిచ్చే మూగజీవాలను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారుతోంది. ఇప్పటికే జనగామ, వరంగల్, కామారెడ్డి, మెదక్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పశుగ్రాసం కొరత మొదలైంది. ఇక పచ్చిగడ్డికి అన్ని జిల్లాల్లోనూ కొరత ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వరి సాగు తక్కువ కావడంతో నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి ఎండుగడ్డిని కొనుగోలు చేస్తూ నిల్వ చేసుకుంటున్నారు. 

రూ.1.60 లక్షలతో ఎండుగడ్డి కొనుగోలు 
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆదిలాబాద్‌ జిల్లా మావలకు చెందిన మడిగ సాగర్‌. తనకున్న 20 గేదెల మేత కోసం రూ.1.60 లక్షలు ఖర్చు చేసి    ఎండుగడ్డి కొనుగోలు చేస్తున్నాడు. ఒక్కో కట్టకు గతేడాది రూ.120 చొప్పున వెచ్చించగా, ప్రస్తుతం రూ.160 చొప్పున కొనుగోలు చేశాడు. కరువు నేపథ్యంలో వెయ్యి కట్టలు కొని ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.

గడ్డి కట్టలకు డిమాండ్‌ 
గతంలో వరి సాగు అధికంగా ఉన్న చోట్ల ఉచితంగానే గడ్డి తీసుకెళ్లిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అన్నిచోట్లా కొనుగోలు చేయాల్సి వస్తోంది. డిమాండ్‌ను బట్టి నగరాలకు క్వింటాల్‌ ఎండుగడ్డికి రూ.500 నుంచి డిమాండ్‌ ఉన్న చోట్ల రూ.900 వరకు పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎండుగడ్డి ఒక్కో కట్టకు రూ.160 వరకు ధర ఉంది. గతంలో ఈ ధర రూ.110 వరకు ఉండేది. 

ఐదు వేలకుపైగా గ్రామాల్లో ప్రభావం 
రాష్ట్ర వ్యాప్తంగా 600 మండలాలుండగా, 315 చోట్ల కరువు పరిస్థితులున్నాయి. పాడి సంపద ఉన్న 5,680 గ్రామాల్లో 73.54 లక్షల పశు సంపదకు మేతకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నట్టు పశుసంవర్థక శాఖ  గుర్తించింది. ఈ మేరకు గడ్డి విత్తనాలు ఉచితంగా రైతులకు అందిస్తూ గ్రామాల్లో చెరువు శిఖం భూముల్లో గడ్డి పెంచేందుకు కార్యాచరణ రూపొందింది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీబీ జీ రామ్‌ జీ కింద సాగు చేయాలని అన్ని జిల్లాలకు యాక్షన్‌ ప్లాన్‌ ఇచ్చారు. కానీ కనీసం నీటి లభ్యత లేక ఆచరణ సాధ్యం కావడం లేదు. కొన్ని చోట్ల రైతులు సొంతంగా సాగు చేసుకొని మేత కొరత తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

గడ్డి దొరక్క ఇబ్బంది 
హార్వెస్టర్‌తో వరి కోసిన గడ్డి గేదెలకు ఉపయోగకరంగా లేకున్నా, కొనక తప్పని పరిస్థితి ఉంది. ఎండలు పెరిగితే గడ్డి దొరక్క మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

ఇరవై ఏళ్ల నాటి పరిస్థితులు 
వానల్లేక 20 ఏళ్ల నాటి పరిస్థితులు వచ్చేట్టు ఉన్నాయి. నాకు ఐదు ఆవులు, ఐదు గేదెలు ఉన్నాయి. గడ్డి కట్ట రూ.50 దొరికేది. ఇప్పుడు రూ.130 చెల్లించాల్సి వస్తోంది. దాణా ఖర్చు పెరుగుతోంది.  
–అజ్గర్‌ అలీ, నవాబుపేట, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement