మళ్లీ మళ్లీ.. ఒకదాని తర్వాత ఒకటి..
అధిక స్క్రీన్ వినియోగంతో ఒత్తిడి, ఆందోళన
డిజిటల్ అలవాట్లు మెదడుపై తీవ్ర ప్రభావం
డిజిటల్ అలవాట్లకు నియంత్రణే ముఖ్యం
సాక్షి, హైదరాబాద్ : అలారం ఆపగానే చేతి వేళ్లు ఫోన్ వైపే వెళ్తున్నాయా? ‘ఒక్క నిమిషం’ అంటూ మెసేజ్‌లు, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేస్తూ అరగంట గడిచిపోతోందా? రాత్రి పడుకునే ముందు చివరిసారి ఫోన్ చూడాలనుకుని రీల్స్ చూస్తూ గంటలు గడుపుతున్నారా? ఇది ఇప్పుడు చాలామందిలో కనిపిస్తున్న డిజిటల్ అలవాటు. ఉదయం లేవగానే స్క్రీన్‌తో రోజును ప్రారంభించడం, రోజంతా నోటిఫికేషన్లు చెక్ చేయడం, రాత్రి నిద్రకు ముందు రీల్స్ చూడటం.. ఇలా చాలామందిలో స్క్రీన్ వినియోగం పెరిగిపోతోంది. దీని ప్రభావం నిద్ర, ఏకాగ్రత, మానసిక స్థితిపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పొద్దున ఫోన్ ఎందుకు వద్దు?
నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే ఫోన్‌లో వచ్చే మెసేజ్‌లు, ఈమెయిల్స్, వార్తలు, సోషల్ మీడియా పోస్టులు మన దృష్టిని ఒక్కసారిగా అనేక అంశాల వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ప్రతికూల వార్తలు లేదా పని సంబంధిత సందేశాలు కనిపిస్తే.. రోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి బదులుగా ఒత్తిడితో ప్రారంభించే అవకాశం ఉంటుంది. ‘ఒక్కసారి చూస్తాను’ అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంటే.. రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా పోస్టులు వరుసగా కనిపిస్తూనే ఉంటాయి. ఒక కంటెంట్ తర్వాత మరో కంటెంట్ చూడాలనే ఆసక్తి పెరుగుతుంది. ఫలితంగా ఉదయం చేయాల్సిన పనులు ఆలస్యం కావచ్చు. రోజులో ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడానికి పట్టే సమయం కూడా పెరగొచ్చు.
ఉదయం ఫోన్‌కు దూరంగా ఉండాలంటే..
మొదటి 30 నిమిషాలు: నిద్ర లేవగానే ఫోన్ చూడకుండా రోజును ప్రారంభించే ప్రయత్నం చేయండి.
అలారం కోసం: సాధ్యమైతే ఫోన్‌కు బదులుగా సాధారణ అలారం గడియారం ఉపయోగించండి. దీంతో ఉదయం అలారం ఆపడానికి ఫోన్ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
నోటిఫికేషన్లకు బ్రేక్: అవసరం లేని యాప్‌ల నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి. ప్రతి అలర్ట్‌కు వెంటనే స్పందించాల్సిన అవసరం లేకుండా చేసుకోండి.
స్క్రీన్‌కు సమయ పరిమితి: రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా కోసం రోజువారీ సమయ పరిమితి పెట్టుకోండి.
ఉదయపు ప్రత్యామ్నాయం: లేవగానే నీరు తాగడం, కొద్దిసేపు నడవడం, స్ట్రెచింగ్ చేయడం, పుస్తకంచదవడం వంటి అలవాట్లను పెంచుకోండి.
సూర్యకాంతి: ఉదయం కొంతసేపు సహజ కాంతిలో గడిపితే రోజును చురుగ్గా ప్రారంభించవచ్చు.
రోజు ప్లాన్: ఫోన్ నోటిఫికేషన్లను అనుసరించకుండా.. ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను ముందుగానే డైరీలో రాసుకోవడం మంచిది.
డోపమైన్ అంటే?
ఫోన్ చూడగానే మన మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలై ఆనందానికి బానిస అయిపోతున్నామనే ప్రచారం ఉంది. డోపమైన్ అనేది మెదడులోని నాడీకణాల మధ్య సమాచార ప్రసారంలో కీలక పాత్ర పోషించే న్యూరోట్రాన్స్‌మీటర్. కొన్ని రకాల అలవాట్ల రూపకల్పనలో ఇది భాగస్వామి. మనకు ఆసక్తికరంగా అనిపించే లేదా రివార్డ్ లభించే అనుభవాలు మళ్లీ చేయాలనే ప్రేరణలో డోపమైన్ వ్యవస్థ పనిచేస్తుంది. అందుకే సోషల్ మీడియా లైక్‌లు, కొత్త నోటిఫికేషన్లు, షార్ట్ వీడియోలు వంటి తక్షణ రివార్డులు పదేపదే అందుబాటులో ఉంటే.. వాటిని మళ్లీ మళ్లీ చూడాలనే అలవాటు బలపడవచ్చు.
» షార్ట్ వీడియో యాప్స్‌లో ఒక వీడియో పూర్తికాగానే మరో వీడియో సిద్ధంగా ఉంటుంది. మనం వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. కొత్తదనం, ఆసక్తికరమైన కంటెంట్ వరుసగా అందడం వల్ల మరికొంతసేపు చూడాలనే కోరిక కలగవచ్చు. ఇలా ఐదు నిమిషాల కోసం మొదలైన స్క్రోలింగ్ అరగంటకు.. ఆ తర్వాత గంటకు చేరుతుంది. రోజువారీ పనులు, చదువు, వ్యాయామం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవచ్చు.
» ముఖ్యంగా ఇది నిద్రకు పెద్ద సమస్యగా మారుతుంది. నిద్ర సమయం తగ్గితే మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు వంటి సమస్యలు కనిపించవచ్చు.
» సోషల్ మీడియాలో ఇతరుల విజయాలు, ప్రయాణాలు, జీవనశైలిని పదేపదే చూడటం వల్ల కొందరు తమ జీవితాన్ని వారితో పోల్చుకోవచ్చు. దీనివల్ల అసంతృప్తి లేదా తమపై తక్కువ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.
నిద్రకు ముందు ఫోన్‌కు గుడ్‌బై
» రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తూ ఉండటం వల్ల నిద్ర సమయం తగ్గకుండా జాగ్రత్త పడాలి.
» ముఖ్యంగా రీల్స్, షార్ట్స్ వంటి నిరంతరం కొత్తకంటెంట్ అందించే యాప్‌ల వినియోగాన్ని నిద్రకు ముందు తగ్గించడం మంచిది.
» రాత్రి ఫోన్‌ను మంచం పక్కన కాకుండా కొంత దూరంలో ఉంచండి. చేతికి అందే దూరంలో ఉంటే తెలియకుండానే తీసుకునే అవకాశం ఎక్కువ.
» అవసరమైతే ‘డు నాట్ డిస్టర్బ్’ మోడ్ ఉపయోగించడం ద్వారా రాత్రి అంతరాయాలను తగ్గించుకోవచ్చు.
అలవాట్లు డిటాక్స్
డోపమైన్‌ను డిటాక్స్ చేయడం కంటే మన అలవాట్లను డిటాక్స్ చేసుకోవడం ముఖ్యం. ఫోన్‌ను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. అది మన జీవితాన్ని సులభతరం చేసే సాధనం. కానీ ఉదయం లేవగానే మొదటి పని ఫోన్ చూడటం, ప్రతి కొన్ని నిమిషాలకోసారి నోటిఫికేషన్లు చెక్ చేయడం, రాత్రి నిద్రను త్యాగం చేసి రీల్స్ చూడటం మాత్రం అలవాటుగా మారకూడదు. టెక్నాలజీని మన అవసరాలకు ఉపయోగించుకోవాలి.. డిజిటల్ జీవితానికి దూరం కావడం కాదు.. దానితో సమతుల్యత సాధించడమే అసలుపరిష్కారం.


