7 లక్షల ఎకరాలకు సాగునీరు | Irrigation Water for 7 lakh acres in Telangana | Sakshi
Sakshi News home page

7 లక్షల ఎకరాలకు సాగునీరు

Aug 20 2026 4:36 AM | Updated on Aug 20 2026 4:36 AM

Irrigation Water for 7 lakh acres in Telangana

మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలతో ప్రణాళిక సిద్ధం 

నిండని నాగార్జునసాగర్‌.. ఆయకట్టుకు సాగునీరు లేదు 

గతేడాది ఖరీఫ్‌లో 37లక్షల ఎకరాలకు నీరు 

ఎల్‌నినోతో జలాశయాల్లో సరిపడా లేని నిల్వలు

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాల్లో తగినన్ని నిల్వలు లేనందున తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన నీటిని సాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వానాకాలంలో గోదావరి పరీవాహకంలోని 21 ప్రాజెక్టుల కింద 6,05,955 ఎకరాలు, కృష్ణా పరీవాహకంలోని 7 ప్రాజెక్టుల కింద 95,108 ఎకరాలు కలిపి మొత్తం 7,01,063 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం జలసౌధలో శాఖ అధికారులతో సమావేశమై జలాశయాల్లో నిల్వలను సమీక్షించి సాగునీటి సరఫరాకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల కింద వెంటనే సరఫరాను ప్రారంభించాలని ఆదేశించారు. 

గతేడాది (2025–26) వానాకాలంలో 37,32,878 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయగా, ఈ ఏడాది కేవలం 7లక్షల ఎకరాలకే సరఫరా చేయగలమని నీటిపారుదల శాఖ అంచనాలు సిద్ధం చేసింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, సాగర్‌లో సరిపడా నిల్వలు లేకపోవడంతో ప్రస్తుతం ఆయకట్టుకు సాగునీటి సరఫరా సాధ్యం కాదని తేల్చింది. కడెం ప్రాజెక్టు కింద ఆదిలాబాద్‌ జిల్లాలో 61 వేల ఎకరాలు, నిజాంసాగర్‌ కింద కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 1,24,254 ఎకరాలు, దేవాదుల కింద వరంగల్, ములుగు, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 2,74,683 ఎకరాలు, సాత్నాలా కింద ఆదిలాబాద్‌ జిల్లాలో 24 వేల ఎకరాలకు సాగునీటి సరఫరా చేయనున్నారు. 


ఇక కృష్ణా పరీవాహకంలోని మూసీ కింద సూర్యాపేట జిల్లాలో 30వేల ఎకరాలు, వైరా ప్రాజెక్టు కింద 17,390 ఎకరాలు, డిండి కింద 12,975 ఎకరాలు, పాకాల కింద 18,193 ఎకరాలకు సాగునీటి సరఫరా చేయనున్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు ఎగువ నుంచి మళ్లీ వరదలు ప్రారంభమై జలాశయాలు పూర్తిగా నిండితే మరోసారి నిల్వలను సమీక్షించి మిగిలిన ఆయకట్టుకు నీటి సరఫరాపై నిర్ణయం తీసుకుంటామని అధికారవర్గాలు తెలిపాయి. సెపె్టంబర్‌ నుంచి ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ హెచ్చరికలున్న నేపథ్యంలో ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నిల్వలను వచ్చే ఏడాది జూలై నాటికి ఉండనున్న తాగునీటి అవసరాలకు పరిరక్షించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement