బాస్ పేరుతో ఉద్యోగికి రూ.కోటి పంపించాలని ఆదేశం
నిజమేనని బదిలీ చేసిన ఉద్యోగి
గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయడంతో రూ.కోటి సేఫ్
బాధితుడికి రీఫండ్ చేసిన సైబరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ‘మీ బాస్ పేరుతో వాట్సాప్‌లో ‘అర్జెంట్‌గా మనీ ట్రాన్స్సఫర్ చేయ్’అని మెసేజ్ వచ్చిందా? అయితే కాస్త ఆగండి.. ఆ ఫొటో వెనుక ఉన్నది మీ ఓనర్ కాదు, మిమ్మల్ని ముంచేయడానికి పొంచి ఉన్న సైబర్ కేటుగాడు కావొచ్చు! సరిగ్గా ఇలాగే నమ్మి అక్షరాలా రూ.కోటి పోగొట్టిన ఒక అకౌంటెంట్ కథ ఇది. అయితే పోయిన డబ్బు తిరిగి రాదనే నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. సైబరాబాద్ పోలీసులు కేవలం పది రోజుల్లోనే రూ. కోటి సొమ్మును వెనక్కి రప్పించారు.
ఆ వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. యూపీలోని లక్నోకు చెందిన దీపక్‌కుమార్ వాటర్ ప్లాంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఆశించిన లాభాలు లేకపోవడంతో సైబర్ నేరాలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఏదైనా ఒక పెద్ద వ్యాపార సంస్థ లేదా దుకాణాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆన్‌లైన్ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించే సంస్థలను గుర్తించాడు.
చీరల వ్యాపారిని టార్గెట్ చేసి...
అలా సైబరాబాద్ కమిషనరేట్ పరిదిలోని ఓ చీరల వ్యాపారిని టార్గెట్ చేశాడు. సోషల్ మీడియా ఖాతాలు, లోకల్ నెట్‌వర్క్ ద్వారా ఆ సంస్థ యజమాని ఎవరు? అక్కడ అకౌంట్స్ చూసేది ఎవరు? అనే వివరాలను దీపక్ సేకరించాడు. యజమాని ఫోన్‌నంబర్ కాకపోయినా మరో నంబర్‌కు సదరు యజమాని అసలు వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్, పేరును వినియోగిస్తూ నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించారు. దీంతో అకౌంటెంట్‌కు మెసేజ్ రాగానే కేవలం ఫొటో, పేరు చూసి అది తన బాస్ నంబరే అని నమ్మేలా భ్రమింపజేయాలనేది నిందితుడి లక్ష్యం.
పథకం ప్రకారం ఈ నెల 4న చీరల రిటైల్ వ్యాపార సంస్థ అకౌంటెంట్‌కు ఫోన్ చేసి ‘నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను. అర్జెంట్‌గా ఈ అకౌంట్‌కు డబ్బులు పంపాలి’ అంటూ ఆ నకిలీ నంబర్ నుంచి మెసేజ్ పంపించారు. దీంతో మెసేజ్ పంపించింది తన బాస్ అనుకొని అకౌంటెంట్ ఏ మాత్రం ఆలోచించకుండా కంపెనీకి చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్ ఖాతా నుంచి నిందితుడు సూచించిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఖాతాకు రూ.కోటి బదిలీ చేశాడు. కొద్ది సమయం తర్వాత అసలు యజమానితో మాట్లాడిన అకౌంటెంట్ తాను మోసపోయానని గ్రహించాడు. విషయం తెలుసుకున్న యజమాని వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగ డీసీపీ కె.పుష్ప, ఏసీపీ రవీందర్‌రెడ్డిల పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ బృందం రంగంలోకి దిగింది. సాంకేతిక ఆధారాల సాయంతో విశ్లే షించగా రూ.కోటి రాయల్ మోడా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో ఉన్న ఒక కార్పొరేట్ కరెంట్ అకౌంట్‌కు చేరినట్టు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేసిన పోలీసులు..ఆ ఖాతాను ఫ్రీజ్ చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడి జాడను కనుగొన్న పోలీసులు.. ఈ నెల 8న లక్నోకు వెళ్లి అరెస్ట్ చేశారు.
అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.కూకట్‌పల్లి కోర్టులో హాజరుపర్చడంతో జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి పోలీసులు.. అభ్యర్థన దాఖలు చేసిన కేవలం ఒక్క రోజులోనే న్యాయమూర్తి స్పందించి ఫ్రీజ్ చేసిన రూ.కోటి సొమ్మును బాధితుడికి రీఫండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోగొట్టుకున్న రూ.కోటిలో రూపాయి కూడా పోగుండా బాధితుడికి తిరిగి చేరింది.


