ప్రజాధనం.. వినియోగ విధానం పాటించాలి | High Court clarifies to government on Kalyanalakshmi and Shadi Mubarak | Sakshi
Sakshi News home page

ప్రజాధనం.. వినియోగ విధానం పాటించాలి

Aug 20 2026 6:07 AM | Updated on Aug 20 2026 6:07 AM

High Court clarifies to government on Kalyanalakshmi and Shadi Mubarak

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై సర్కార్‌కు హైకోర్టు స్పష్టం 

ప్రభుత్వం ఆర్థిక విధానాలు ఎలా రూపొందించుకోవాలో మేం చెప్పం 

అయితే.. పౌరుల హక్కులు, రాజ్యాంగ నిబంధనలు సర్కార్‌ మరవొద్దు 

ఏళ్లుగా సర్కార్‌ నుంచి రావాల్సిన నగదు కోసం భూ నిర్వాసిత రైతుల ఎదురుచూపు 

స్టే ఎత్తివేతపై నేడు విచారణ.. చెల్లింపుల ప్రాధాన్యం చెప్పాలన్న ధర్మాసనం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం సంక్షేమ పథ కాలను అమలు చేయడమే కాకుండా తన చట్టబద్ధమైన బాధ్యతలను కూడా సమర్థవoతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అదే సయమంలో ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను ఎలా రూపొందించుకోవాలో తాము నిర్దేశించలేమని, అయితే పౌరుల చట్టబద్ధ హక్కులు, ప్రజాధనం వినియోగ విధానాలను పాటించాలని స్పష్టం చేసింది. అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి భూములిచ్చి పరిహారం కోసం ఏళ్లుగా రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గుర్తుచేసింది. ప్రజలకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అవసరం తగ్గే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. 

విచారణ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి లాభాలను కూడా ప్రసావించింది. ప్రభుత్వానికి చెంది న సంస్థలు లాభాలు ఆర్జిస్తే వాటిని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించొచ్చు కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రాధాన్యం ఏంటో చెప్పాలని సర్కార్‌ ఆదేశిస్తూ.. స్టేపై గురువారం తేలుస్తామని చెబుతూ, విచార ణ వాయిదా వేసింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల అమలుకు చట్టపరమైన, శాసనపరమైన ఆధారం లేదంటూ.. ప్రభు త్వం జారీ చేసిన 8 జీఓలను సవాల్‌ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.  

పథకాలకు మేం వ్యతిరేకం కాదు.. 
ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. ఇలాంటి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని, ముఖ్యంగా బాలికల సాధికారతే వీటి లక్ష్యమన్నారు. పథకాల ద్వారా రాష్ట్రంలోని యువతులు ఎలా ప్రయోజనం పొందుతున్నారో, నిధుల సమీకరణ, చట్టబద్ధత తదితర అంశాలపై ఇప్పటికే కౌంటర్‌ వేశామన్నారు. పథకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కూడా అభ్యర్థించారు. న్యాయవాది విజయ్‌గోపాల్‌ వాదిస్తూ.. ఒక పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించినంత మాత్రాన ప్రత్యేక చట్టం అవసరం లేదన్న ప్రభుత్వ వాదన సరైంది కాదన్నారు. ప్రజాధనం ఖర్చుపై మార్గదర్శక సూత్రాలను నిర్దేశించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

జీతాలు, పింఛన్లు, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు, అప్పుల చెల్లింపులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఇతర వ్యయాలకు నిధుల కేటాయింపు జరగాలన్నారు. పథకం మంచిదా? చెడ్డదా? అన్నది తన వాదన కాదని, దానిపై వ్యతిరేకతా లేదని, చట్టం లేకుండా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఇలాంటి పథకాన్ని అమలు చేయవచ్చా? అన్నదే ప్రధాన ప్రశ్న అని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. భూసేకరణ పరిహారాల విషయంలో కోర్టుల్లో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కొన్నింటిలో 50 శాతం పరిహారం కూడా చెల్లించలేదన్నారు. ప్రభుత్వం కోర్టులో హామీలు ఇవ్వడం, చెల్లింపుల కోసం టోకెన్లు జారీ చేస్తున్నా, వాస్తవంగా నిధులు విడుదల కావడం లేద ని చెప్పారు. సంక్షేమ పథకాలకు కోర్టులు వ్యతిరేకం కాదని, అయితే వాటి చట్టబద్ధత ఏంటో తేలాల్సిన అవసరం ఉందన్నారు.  

సోషల్‌ మీడియాలో పోస్టులొద్దు.. 
కల్యాణలక్షి, షాదీ ముబారక్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. సీఎం రేవంత్, పిటిషనర్‌పై దుష్ప్రచారం చేస్తూ ‘తెలుగు స్క్రైబ్‌’పేరిట ప్రచురితమైన కంటెంట్‌ను తొలగించాలని మెటా, ఎక్స్‌ (ట్విటర్‌), గూగుల్‌ ఎల్‌ఎల్‌సీ ప్లాట్‌ఫామ్‌లకు స్పష్టం చేసింది. సీఎం రేవంత్‌ ఈ పథకాలను ఆపేందుకు కుట్ర చేస్తున్నారంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారన్న పిటిషనర్‌ వాదనను పరిగణనలోకి తీసుకొని ఈ ఆదేశాలిచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement