మైనర్లలో హింసాత్మక మనస్తత్వం | Violent mentality among minors | Sakshi
Sakshi News home page

మైనర్లలో హింసాత్మక మనస్తత్వం

Aug 20 2026 6:03 AM | Updated on Aug 20 2026 6:03 AM

Violent mentality among minors

రూపారెడ్డి హత్యకు ‘కండక్ట్‌ డిజార్డర్‌’ కారణం 

‘మమ్మల్ని గుర్తుపట్టారు’అన్న భయమే ప్రాణం తీసిందా?  

ఇది మానసిక రుగ్మత కాదు.. వ్యతిరేక సామాజిక ప్రవర్తనకు సంకేతం కావచ్చు: మానసిక నిపుణులు 

హెచ్చరిక సంకేతాలను గుర్తించాలని తల్లిడండ్రులకు సూచన

సాక్షి, హైదరాబాద్‌: చిన్న వయసులోనే విలాసాలకు అలవాటు పడటం.. అందుకు అవసరమైన డబ్బుల కోసం దొంగతనానికి పాల్పడటం.. దొంగతనం చేస్తుండగా గుర్తుపట్టిన వ్యక్తిని చివరకు హత్య చేయడం... నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఓ ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి హత్య ఘటన మైనర్లలో పెరుగుతున్న ప్రమాదకర ప్రవర్తనకు అద్దం పడుతోంది. డబ్బు లు దొంగిలించే ప్రయత్నంలో తమను గుర్తుపట్టారనే భయంతో ప్రిన్సిపాల్‌పై దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నల్లగొండ ఘటన ఒక హత్య కేసు మాత్రమే కాదు.. ‘సరదా–సాహసం–డబ్బు–దొంగతనం–దాన్ని కప్పిపుచ్చేందుకు హింస’అనే ప్రమాదకర మానసిక ప్రయాణం ఎక్కడ ఆగాలి? అన్న ప్రశ్నను సమాజం ముందుంచుతోంది.  

భవిష్యత్‌ పరిణామాలపై ఆలోచన కరువు 
యుక్తవయసులో మెదడు ఇంకా అభివృద్ధి దశలోనే ఉంటుంది. ఆవేశాలను నియంత్రించడం, ప్రమాదాన్ని అంచనా వేయడం, భవిష్యత్‌ పరిణామాలను ముందుగా ఊహించడం వంటి సామర్థ్యాలు పూర్తిగా పరిపక్వం కావడానికి సమయం పడుతుంది. అదే సమయంలో తక్షణ ఆనందం, సాహసం, ప్రమాదకర అనుభవాల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉండొచ్చు. 

పరిశోధన లు కూడా యుక్తవయసులో ఆవేశపూరిత, ప్రమాదకర ప్రవర్తన కు ఈ అభివృద్ధి దశ ఒక కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ‘దొంగతనం బయటపడితే?’అనే భయానికి ‘హత్య చేస్తే సమస్యే ఉండదు’అనే అత్యంత తీవ్రమైన, తక్షణ పరిష్కారం కనిపించే అవకాశం ఉంటుంది. ఇది ‘ఆ వేశపూరిత నిర్ణయం, ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయడం, భవిష్యత్‌ పరిణామాలపై ఆలోచించకపోవడం’వంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉండొచ్చని మానసిక వైద్యులు విశ్లేషిస్తున్నారు.  

కండక్ట్‌ డిజార్డర్‌లో భాగమే.. 
విద్యార్థులుగా ఉన్న మైనర్లు తమ ప్రిన్సిపాల్‌ రూపారెడ్డిని హత్య చేయాలనే ఆలోచనను మానసిక రుగ్మత లేదా సైకోపతిగా పిలవడం సరైంది కాదని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదేపదే నియమాలను ఉల్లంఘించడం, అబద్ధాలు, దొంగతనాలు, దూకుడు, ఇతరుల హక్కులను పట్టించుకోకపోవడం, చేసిన పనిపై పశ్చాత్తాపం లేకపోవడం వంటి ప్రవర్తనలు కొనసాగితే నిపుణులు ‘కండక్ట్‌ డిజార్డర్‌’(ప్రవర్తనా రుగ్మత)గా భావిస్తారు. సామాజిక ప్రవర్తన కూడా ఇలాంటి నేరంలో భాగమై ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 

ఇలాంటి ఘటనల్లో మరో కీలక అంశం ‘తోటివారి ప్రభావం’. ఒకరు చేసిన తప్పును మరొకరు ఆపకుండా ప్రోత్సహిస్తే.. సమూహంలో బాధ్యతాభావం తగ్గు తుంది. ‘అందరం కలిసి చేశాం’అనే భావన వ్యక్తిగత భయా న్ని తగ్గించవచ్చని అంటున్నారు. దొంగతనాలు, తరచూ గొడవలు, బెదిరింపులు, అబద్ధాలు, నియమాలను ధిక్కరించడం, ప్రమాదకర పనులపై ఆసక్తి, మద్యం లేదా మాదక ద్రవ్యాల వినియోగం, ఇతరుల బాధ పట్ల స్పందన తగ్గడం వంటి సంకేతాలను కుటుంబం, పాఠశాలలు ముందుగానే గుర్తించాలని సూచిస్తున్నారు. 

సైకోటిక్‌ బిహేవియర్‌లో భాగమే... 
‘సైకోటిక్‌ బిహేవియర్‌’లో భాగంగానే మానసికంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సోషల్‌ మీడియాతోపాటు, ఓటీటీల్లో క్రైమ్‌ కథనాలు, ఒకరిని ఎలా చంపవచ్చో సవివరంగా తెలియజేయడం వంటివి అప్పటికే ప్రభావితమైన మనసులను మరింత కలుషితం చేస్తున్నాయి. అప్పటికే వారిలో అంతర్గతంగా ఉన్న హింసాత్మక ఆలోచనలను గంజాయి మరింత ప్రోత్సహించి, తాము చేయదలుచుకున్నది తప్పు కాదనే భావనను పెంచుతుంది. ఎవరిపై అయినా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్న వారు దానిని ఎక్కువ కాలం తమలో దాచుకోలేరు. వారిలో ప్రతీకారేచ్ఛ మరింత తీవ్రంగా ఉంటుంది.  ఆ అగ్రెసివ్‌ బిహేవియర్‌ని గుర్తించి తగిన కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే సమస్య సద్దుమణుగుతుంది. – సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్, యూ అండ్‌ మీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ 

డబ్బుల మీద ఆశ పెరుగుతోంది... 
సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశ చిన్నపిల్లలు, యుక్తవయసు్కల్లో పెరుగుతోంది.   నైతికత, విలువలకు పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా, తాము నలుగురిలో నవ్వుల పాలైనందుకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన వారిని హింసాత్మక చర్యలకు పురిగొల్పుతుంది. అయితే ఇలాంటి ఘటనలను ఏదో క్షణికావేశంలో చేశారని భావించడానికి లేదు. పక్కా ప్లానింగ్‌తోనే ఈ హత్య జరిగినట్టుగా కనిపిస్తోంది. హత్యకు ముందు ఆన్‌లైన్‌లో సెర్చింగ్, పూర్తి ప్రణాళికతోనే దీనిని చేశారు. ఇలాంటి పిల్లల్లో ‘మూడ్‌ స్వింగ్స్‌’ను తల్లితండ్రులు, టీచర్లు గమనిస్తుండాలి. ముందుగా గుర్తిస్తే ఇలాంటి వాటిని నియంత్రించవచ్చు.  – నిషాంత్‌ వేమన, కన్సల్టింగ్‌ సైకియాట్రిస్ట్, కేర్‌ హాస్పిటల్‌    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement