1908.. ఆ రెండు రోజులు

Story On 1908 Musi River Floods In Hyderabad - Sakshi

సెప్టెంబర్‌ 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రళయం

నగరమంతా 17 సెం.మీల వర్షం 

60 అడుగుల ఎత్తులో మూసీ వరద బీభత్సం 

15 వేల మంది మృత్యువాత, భారీగా ఆస్తినష్టం

సాక్షి,హైదరాబాద్‌: 1908.. సెప్టెంబర్‌ 27, 28వ తేదీలు. ఈ రెండు రోజులు.. 429 సంవత్సరాల హైదరాబాద్‌ చరిత్రలో చెరగని చీకటి అధ్యాయాలు. అప్పటి వరకు ముత్యాల నగరంగా మురిసిపోయిన మహానగరం ఊహించని జల ప్రళయంతో విలవిల్లాడింది. ఏకంగా 15 వేల మంది ప్రాణాలు తీసిన రాకాసిగా మూసీ నది ఉగ్రరూపం చూపింది. హైదరాబాద్‌ పశ్చిమ భాగంలో మొదలైన భారీ వర్షంతో నగరానికి వరద ముప్పు ఉందన్న హెచ్చరికను సెప్టెంబర్‌ 27 తెల్లవారుజామున 2 గంటలకు జారీ చేసిన నాలుగు గంటల్లోనే మూసీ తీరంపై క్లౌడ్‌ బరస్ట్‌ (మేఘ విచ్ఛిత్తి) కావటంతో 27, 28 తేదీల్లో 36 గంటల పాటు ఉగ్రరూపాన్ని చూపింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ కేంద్రంలోని రెయిన్‌గేజ్‌.. ఆ వర్షాన్ని 17 సెం.మీ.గా రికార్డు చేసింది.

కుండపోత వర్షం మూసీ నది మట్టం నుంచి 27 తెల్లవారుజామున 20 అడుగుల ఎత్తుకు ఎగస్తూ.., 28 నాటికి 60 ఫీట్ల ఎత్తుతో ఉగ్రరూపాన్ని చూపి నదికి ఇరువైపులా ఉన్న.. కోల్సావాడీ(బొగ్గులబస్తి), ఘాన్సీబజార్, అఫ్జల్‌గంజ్, కోకాకీ తట్టీలను నిండా ముంచేసింది. ఏకంగా అఫ్జల్‌గంజ్‌లో 11 అడుగుల వరదనీరు నిలిచిపోయి హైదరాబాద్‌ రాష్ట్ర వ్యాపార సంస్థలు కుప్పకూలాయి. అంతే కాకుండా మూసీ ఉగ్రరూపానికి పురానాపూల్‌ నర్వా (1578లో నిర్మించిన ఓల్డ్‌ బ్రిడ్జి) 1860లో నిర్మించిన ముసల్లం, ఛాదర్‌ఘాట్‌ బ్రిడ్జీలు పూర్తిగా ధ్వంసం కాగా, నిజాం ఆస్పత్రి (ప్రస్తుతం ఉస్మానియా) ఆనవాళ్లు లేకుండా పోయింది. కోఠిలోని బ్రిటిష్‌ రెసిడెన్సీ–సికింద్రాబాద్‌ జేమ్స్‌ స్ట్రీట్‌ పూర్తిగా నీట మునిగాయి. 

శవాల దిబ్బగా నగరం.. 
మూసీ ఉగ్రరూపానికి 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. మూసీలో కొట్టుకుపోయిన వారు కాకుండా నగరమంతా శవాల దిబ్బగా మారింది. మూసీ ఒడ్డున ఉన్న చింతచెట్టును ఎక్కి వందల మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఈ ప్రళయంలో 15 వేల మంది చనిపోయారని 6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ప్రకటించారు. ఆయన స్వయంగా కాలినడకన నగరమంతా తిరుగుతూ శవాలను సామూహిక ఖననం చేయించారు. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 13 వరకు సెలవు దినాలుగా ప్రకటించి తన నివాస గృహమైన పురానీ హవేలీతో పాటు అన్ని ప్యాలెస్‌లలో ఉచిత భోజన, వైద్య, వసతి కల్పించారు. వరద సహాయ చర్యల కోసం నిజాం ప్రభుత్వం 50 లక్షలు కేటాయిస్తే.. నగర ప్రముఖులు మరో కోటి రూపాయలు విరాళాలుగా అందజేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నిపుణుడు సయ్యద్‌ ఆజం హుస్సేనీ నేతృత్వంలోని కమిటీ ఏడాదిలో నివేదిక ఇచ్చింది. 

వరదలతో కనువిప్పు.. 
హైదరాబాద్‌ వరద విషాదంపై ఆజం హుస్సేనీ ఇచ్చిన నివేదికపై 1911లో పగ్గాలు చేపట్టిన ఉస్మాన్‌ అలీఖాన్‌ కార్యాచరణ ప్రకటించి ఇంజనీరింగ్‌ నిపుణుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నగర బాధ్యతలు అప్పగించారు. ఆయన సూచనల మేరకు అనేక రంగాల నిపుణులతో 1912లో సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు నగరానికి పశ్చిమాన 16 కి.మీ. దూరంలో 1920లో ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), 1927లో హిమాయత్‌సాగర్‌ను పూర్తి చేశారు. మూసీ పరివాహక ప్రాంతమంతా 60 అడుగుల ఎత్తుతో పటిష్టమైన ప్రహరీగోడ నిర్మించారు. 1931 నాటికి డ్రైనేజీ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా నాటి అవసరాల మేరకు నగరంలో సుమారు 700 కి.మీ. మేర భూగర్భ డ్రైనేజీ సదుపాయం సమకూర్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top