గద్వాల జిల్లా ఇర్కిచేడులో 144 సెక్షన్‌ 

Statue Of BR Ambedkar Set On Fire In Jogulamba Gadwal District - Sakshi

అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై రాజుకున్న వివాదం 

విగ్రహానికి నిప్పు, రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు 

గద్వాల రూరల్‌/ కేటీదొడ్డి: బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుపై రాజుకున్న వివాదం.. చివరికి విగ్రహానికి నిప్పుపెట్టడంతో పాటు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. దీంతో గ్రామంలో ఏప్రిల్‌ 6 వరకు 144 సెక్షన్‌ను విధించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడులో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు ఒక వర్గం  వారు నిర్ణయించి తహసీల్దార్‌ వద్ద  అనుమతి పొందారు.

సదరు స్థలం అప్పటికే నీలమ్మ అనే మహిళ కబ్జాలో ఉంది. గురువారం ఆ స్థలంలో విగ్రహాన్ని పెట్టేందుకు యత్నించగా నీలమ్మ, ఆమె కుటుంబీకులు ఆత్మహత్య చేసుకుంటామని అడ్డుకున్నారు. దీంతో విగ్రహాన్ని రోడ్డు మధ్యలో పెట్టేందుకు యత్నించగా గ్రామానికి చెందిన మరోవర్గం వారు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అప్పటికే ఆత్మహత్య చేసుకుంటానని వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ సీసాలను విగ్రహం పరిసర ప్రాంతంలో పడేశారు. పోలీసులు అక్కడి నుంచి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసిన చోట నిప్పు అంటించారు. దీంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి, ఎస్సై కురుమయ్య కాలికి అంటుకున్నాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి విగ్రహాన్ని తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు.

విషయం తెలుసుకొని కర్ణాటకలోని రాయచూరు, ఇర్కిచేడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంబేడ్కర్‌వాదులు భారీ సంఖ్యలో గ్రామానికి చేరుకోవడంతో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్పెషల్‌ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ ఇర్కిచేడును సందర్శించి ఏప్రిల్‌ 6 వరకు గ్రామంలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top