
ఈ ఏరియాలో పనిచేసే ఓ కార్మికుడికి అత్యధికంగా రూ.3,27,018 బోనస్
అధికంగా బోనస్ అందుకునే మొదటి పది మందిలో ఈ ఏరియా నుంచే ఎనిమిది మంది
అండర్ గ్రౌండ్ కార్మికులకు మస్టర్‌కు రూ.805.37 చెల్లింపు
లాభాల్లో వాటా ఖరారు చేసిన సింగరేణి సంస్థ
29న కార్మికుల ఖాతాల్లో జమ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ప్రకటించిన లాభాల వాటాలో శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేసే టింబర్ యార్డ్ వర్క్‌మన్ సుద్దిమల్ల శ్రీనివాస్‌కు అత్యధికంగా రూ.3,27,018 బోనస్ లభించనుంది. అలాగే మొత్తం సింగరేణి వ్యాప్తంగా అధికంగా బోనస్ అందుకునే మొదటి పది మందిలో ఈ ఏరియా నుంచే ఎనిమిది మంది ఉండడం విశేషం. సింగరేణి సంస్థ అందించే లాభాల వాటాలో ఏ విభాగంలోని కార్మికులకు ఎంత మొత్తం బోనస్ వస్తుందన్న వివరాలను శనివారం యాజమాన్యం వెల్లడించింది.
దీని ప్రకారం.. మరో టింబర్‌యార్డ్ వర్క్‌మన్ మేషు కిశోర్ రూ.3,20,093, ఎస్టీపీసీ డీవైజీఎం ఎనగందుల శ్యాంరాజ్ రూ.3,13,724, ఆర్జీ–3 ఏరియా జీడీకే–11 సీనియర్ మైనింగ్ సర్దార్ నాగ వేణుగోపాల్ రూ.3,12,897 బోనస్‌గా అందుకోనున్నారు.
అలాగే, శ్రీరాంపూర్ ఏరియా ఆర్‌కేఎన్‌టీ గని హెడ్ ఓవర్‌మన్ జక్కినబోయిన సదానందం రూ.3,06,850, ఆర్కే–7 గని ఫోర్‌మన్ మెకానిక్ పుదారి ఉమేశ్‌గౌడ్ రూ.3,06,184, టింబర్ యార్డ్ వర్క్‌మన్ ఈసంపల్లి ప్రభాకర్ రూ.3,05,614, ఆర్కే–5 గని ఎస్‌డీఎల్ ఆపరేటర్ బండారి శ్రీనివాస్ రూ.3,05,334, ఆర్జీ–1 ఏరియా జీడీకే–11 గని అదనపు మేనేజర్ బి.మల్లేశం రూ.3,03,759, శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–5 గని ఎస్‌డీఎల్ ఆపరేటర్ అటికం శ్రీనివాస్ రూ.3,03,715 అందుకోనున్నారు.
అండర్ గ్రౌండ్ కార్మికులకు మస్టర్‌కు రూ.805.37
సింగరేణి సంస్థ 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంస్థలో సుమారు 40 వేల మంది కార్మికులకు రూ.802.40 కోట్లు వాటాగా చెల్లించనున్నారు. కాగా, సింగరేణిలో పనిచేసే ఉద్యోగులను యాజమాన్యం వివిధ విభాగాలుగా విభజించింది.
ఇందులో అండర్ గ్రౌండ్ కార్మికులకు మస్టర్ (ఒక రోజు హాజరు)కు రూ.805.37 చొప్పున చెల్లించనున్నారు. అంటే అత్యధిక హాజరు నమోదైన వారికి అత్యధిక బోనస్ అందనుంది. ఇక ఓసీ, సీఎస్‌పీ, ఎస్టీపీపీ ఉద్యోగులకు మస్టర్‌కు 637.58, డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు రూ.588.53 చొప్పున చెల్లించనున్నారు. ఈ లెక్కల ప్రకారం సింగరేణి యాజమాన్యం లాభాల బోనస్ డబ్బును సోమవారం కార్మికుల ఖాతాల్లో జమ చేయనుంది.