డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం

Published Sat, Dec 30 2023 4:14 AM

Special focus on cyber crime - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మత్తుపదార్థాల రవాణా, విక్ర య ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ రవిగుప్తా పునరుద్ఘాటించారు. మత్తుపదార్థాలు అమ్మినా, కొన్నా, వాడినా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎంతటివారున్నా ఈ విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల కట్టడి, సైబర్‌ నేరాల అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రానున్న ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.

2022తో పోలిస్తే 2023లో రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదు 8.97 శాతం పెరిగినట్టు వెల్లడించారు. సైబర్‌ నేరాల నమోదు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ వార్షిక నివేదిక 2023ను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు.

కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్, హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సీఐడీ అడిషనల్‌ డీజీ శిఖాగోయల్, రోడ్డు భద్రత విభాగం అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్, నార్కోటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, ఆపరేషన్స్‌ అడిషనల్‌ డీజీ విజయ్‌కుమార్, సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఐజీలు రమేశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్‌ శ్రీనివాస్‌ ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రానున్న ఏడాదిలో పోలీస్‌శాఖ భవిష్యత్‌ కార్యాచరణ అంశాలను డీజీపీ వివరించారు.

డీజీపీ పేర్కొన్న కీలక అంశాలు:  
♦ మత్తుపదార్థాల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉంటాం. ఒక్క డ్రగ్స్‌ కేసు నమోదైనా పీడీయాక్ట్‌ పెట్టే అవకాశం ఉంటుంది.
♦ పబ్బులు, క్లబ్బులు, ఫాంహౌస్‌లు, బార్‌లలో ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా అత్యంత కఠినచర్యలు తప్పవు. 
♦ తల్లిదండ్రులు, విద్యా సంస్థలు సైతం మత్తుపదార్థాల కట్టడిలో పోలీస్‌శాఖతో కలిసి రావాలి. విద్యా సంస్థల్లోనూ యాంటీ డ్రగ్స్‌వాడకంపై దృష్టి పెట్టాలి. 
♦ దేశంలోనే తొలిసారిగా  తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్‌ నేరాలపై ఇప్పటివరకు 90 వేల ఫిర్యాదులు అందాయి.  
♦ సైబర్‌నేరాలపై 14,271 ఎఫ్‌ఐఆర్‌ల నమోదుతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని 
అందుబాటులోకి తెచ్చాం. 
♦ రోడ్డు ప్రమాదాలు తగ్గిడంలో ఈ ఏడాది సఫలం అయ్యాం. 
♦  ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టం ఎంతో మెరుగైంది. రాష్ట్రంలో ఇప్పుడు సరాసరి రెస్పాన్స్‌ టైం 7 నిమిషాలు.
♦ అతి త్వరలోనే 15,750 మంది వివిధ శాఖల్లోని కానిస్టేబుళ్ల ట్రైనింగ్‌ ప్రారంభిస్తాం.

Advertisement
 
Advertisement
 
Advertisement