ఆ తర్వాత భయంతో ఆత్మహత్య చేసుకున్న కొడుకు
మద్యం మత్తులో ఘాతుకం
భూదాన్‌పోచంపల్లి: మద్యం మత్తులో తల్లిని హత్య చేసిన కుమారుడు.. ఆతర్వాత భయంతో తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన సంగెం గంగయ్య, పోశమ్మ(69) దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. గంగయ్య ఇరవై ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారులంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడగా, పోశమ్మ ఒక్కతే గ్రామంలో నివాసముంటోంది.
హైదరాబాద్‌లోని చింతల్‌లో ఉంటున్న పోశమ్మ చిన్న కుమారుడు శ్రీనివాస్(42) కూకట్‌పల్లి బస్సు డిపోలో డ్రైవర్‌గా పనిచేసి అనారోగ్యం కారణంగా మూడేళ్ల నుంచి ఖాళీగా ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య చాలాకాలంగా నెలకొన్న భూవివాదం మాట్లాడుకొనే విషయమై మూడు రోజుల క్రితమే కుటుంబంతో కలిసి పెద్దరావులపల్లికి వచ్చాడు. ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అన్న వెంకటేశ్‌పై ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల్లో పిలిపించి మాట్లాడుదామని పోలీసులు నచ్చజెప్పి పంపించారు.
సాయంత్రం మద్యం సేవించిన శ్రీనివాస్ తన భార్య పద్మను తీవ్రంగా కొట్టడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్ కుమారులు తండ్రిని కొట్టి, తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. భార్యాపిల్లలు హైదరాబాద్‌కు వెళ్లిపోగానే శ్రీనివాస్ తల్లి పోశమ్మను పింఛన్ డబ్బులు రూ.1000 అడుక్కొని మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ సైకోగా మారి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి పోశమ్మ తలపై బండరాయితో మోది హత్య చేశాడు.
సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తు దిగడంతో తాను చేసిన నేరానికి భయపడిపోయాడు. ఉదయం బీబీనగర్ మండలం భట్టుగూడెంకు వెళ్లి మద్యం తెచ్చుకొని ఇంట్లో తలుపులు పెట్టుకొని సేవించాడు. అనంతరం గదిలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోశమ్మ ఉదయం నుంచి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు తలుపుల సందులోంచి చూడగా తల్లీ కొడుకులు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, రూరల్ సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, క్లూస్ టీమ్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
భర్తను చంపిన భార్య
కుటుంబ కలహాలతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
దేవరకద్ర రూరల్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు భర్తను బలితీసుకున్నాయి. భర్తపై కత్తితో దాడిచేసి భార్య హతమార్చిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాయపల్లికి చెందిన కుర్వ నాగేశ్ (38)కు కోయిల్‌కొండ మండలం మల్కాపూర్‌కు చెందిన కవితతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. నాగేశ్ గొర్రెల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అతడికి అనుమానం కలగడంతో దంపతులిద్దరి మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే నాగేశ్ పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ, మద్యానికి బానిస కావడంతో కుటుంబ కలహాలు మరింత తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న నాగేశ్‌కు కవితకు మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నాగేశ్‌పై కవిత కత్తితో దాడికి పాల్పడింది. ఈ సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్న చిన్న కుమారుడు రాము తండ్రి ఆర్తనాదాలు విని మేల్కొన్నాడు. తండ్రిపై తల్లి దాడి చేస్తుండటాన్ని చూసి భయంతో బయటకు వచ్చి కేకలు వేశాడు. బయట నిద్రిస్తున్న ఇతర కుటుంబసభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకోగా అప్పటికే నాగేశ్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
అతడిని చికిత్స నిమిత్తం ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తన వదినకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతోనే గొడవలు జరుగుతున్నాయని, అదే కక్షతో తన అన్నపై కత్తితో దాడిచేసి హతమార్చిందని మృతుడి సోదరుడు రాజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.


