ట్యాపింగ్‌ కేసు.. వ్యూహం మార్చిన సిట్‌ | SIT Probe Into Telangana Phone Tapping Case Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

ట్యాపింగ్‌ కేసు.. వ్యూహం మార్చిన సిట్‌

Jun 13 2025 8:15 AM | Updated on Jun 13 2025 9:02 AM

Sit Probe Into Phone Tapping Case Updates

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు తిరిగి రావడం, ఆయన విచారణ పర్వం కొనసాగుతుండటంతో అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తును సిట్‌ అధికారులు ముమ్మరం చేశారు. విచారణ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్తుండటంతో తమ వ్యూహం మార్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి, బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులను మరోసారి ప్రశ్నించాలని నిర్ణయించారు.

ఎస్‌ఐడీలోని ఎస్‌ఓటీకి నేతృత్వం వహించిన డి.ప్రణీత్‌రావు ఈ కేసులో అరెస్టు అయిన తొలి నిందితుడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఈయన్ను బుధవారం ప్రభాకర్‌రావుతో కలిపి విచారించారు. తాజాగా శుక్రవారం సైతం విచారణ హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్‌రావు శనివారం మరోసారి సిట్‌ ఎదుట విచారణకు వస్తుండటంతో ఒక రోజు ముందు ప్రణీత్‌ను ప్రశ్నించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు మూలం ఎస్‌ఐబీ కార్యాలయంలోని హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయడం. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీగా పని చేస్తున్న డి.రమేష్‌ ఫిర్యాదు ఆధారంగా కుట్ర, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో చాన్నాళ్ల తర్వాత టెలిగ్రాఫిక్‌ యాక్ట్‌ చేర్చారు. నల్లగొండ జిల్లాలో పని చేస్తూ, ఇన్‌స్పెక్టర్‌ హోదాలో 2018లో ఎస్‌ఐబీలోకి ప్రవేశించిన దుగ్యాల ప్రణీత్‌ రావుకు 2023లో డీఎస్పీగా యాక్సిలేటరీ పదోన్నతి లభించింది. ఈయన ఎస్‌ఐబీలో ఉన్న మిగిలిన అధికారుల మాదిరిగా కాకుండా విధులు నిర్వర్తించారు.

ఎస్‌ఐబీ కార్యాలయంలో తన కోసం ప్రత్యేకంగా రెండు గదులను ఏర్పాటు చేసుకున్నారు. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కూడా తీసుకు 17 అత్యాధునిక కంప్యూటర్లతో పని చేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల పేరుతో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రణీత్‌ తన అధికారాన్ని దురి్వనియోగం చేస్తూ నిఘాకు సంబంధించిన అనేక వివరాలను తన వ్యక్తిగత డ్రైవ్‌ల్లో భద్రపరుచుకున్నారని, 2023 డిసెంబర్‌ 4 రాత్రి ఎస్‌ఐబీ కార్యాలయంలోకి వచ్చిన ప్రణీత్‌ రావు అక్కడి సీసీ కెమెరాలు పని చేయకుండా ఆపేసి కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్‌ చేయడంతో పాటు ఎస్‌ఐబీకి చెందిన 42 హార్డ్‌ డిస్క్‌లను ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

రెండు టీబీల డేటాను డిలీట్‌ చేయడంతో పాటు దాదాపు 1600 పేజీల కాల్‌ డేటాను కూడా ప్రణీత్‌ రావు తగులబెట్టినట్లు, కొన్ని హార్డ్‌ డిస్క్‌ల్ని ధ్వంసం చేయడంతో పాటు మరికొన్ని తీసుకుపోయి వాటి స్థానంలో కొత్తవి పెట్టినట్లు తేల్చారు. ప్రణీత్‌ రావు ఎస్‌ఐబీలో పని చేసినప్పుడు 30 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఉంది.

అప్పట్లో ఎస్‌ఐడీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు ఉండటంతో ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని సిట్‌ అనుమానిస్తోంది. ఈ ఆరోపణల్లో అత్యధికం ప్రభాకర్‌రావు ఖండిస్తుండటంతో సిట్‌ అప్రమత్తమైంది. శుక్రవారం ప్రణీత్‌రావు నుంచి సేకరించే వివరాల ఆధారంగా శనివారం ప్రభాకర్‌రావుకు సంధించాలి్నన ప్రశ్నావళిని సిద్ధం చేయనున్నారని తెలిసింది. ప్రణీత్‌ తర్వాత భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులకూ నోటీసులు జారీ చేసి ప్రశి్నంచేందుకు సిట్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement