
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు.
వివరాల ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. అనంతరం, ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్ రావు.. పలువురు బీఆర్‌ఎస్ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది.