5 ఏరియాలు టాప్‌

Singareni Company Reveals Coal Production Details - Sakshi

మరో ఆరు ఏరియాలు ఉత్పత్తిలో వెనుకంజ

బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించిన సింగరేణి

వెనకబడిన ఏరియాల్లో తీరు మారాలన్న సీఎండీ

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021 – 2022)లో 70 మిలియన్‌ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్‌ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్‌లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. 

వెనుకబడిన ఆరు ఏరియాలు 
ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. 

జూన్‌లో 102% ఉత్పత్తి 
సింగరేణిలో గడిచిన జూన్‌లో 20 ఓపెన్‌కాస్ట్‌ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్‌తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్‌లోని మణుగూరు టాప్‌గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్‌లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. 

వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి 
త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్‌వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి.
– ఎన్‌.శ్రీధర్, సింగరేణి సీఅండ్‌ఎండీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top