గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషన్..
స్పష్టత ఇవ్వని సింగరేణి యాజమాన్యం
సాక్షి, పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌తో ఆశావహులతోపాటు వివిధ రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. కానీ సింగరేణి కార్మికుల్లో అయోమయం తొలగిపోవడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ సింగరేణి అధికారులు తప్ప కిందిస్థాయి కార్మికులు పోటీచేయొచ్చని స్పష్టత ఇచ్చినా.. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు.
దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిలో అయోమయం నెలకొంది. తొలివిడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఇప్పటివరకు సింగరేణి స్పష్టత ఇవ్వలేదు. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నా..
ఎన్నికల్లో పోటీచేసేవారు తమ ఉద్యోగానికి రాజీనామా చేయాలని సింగరేణి గతంలోనే ఉత్తర్వులు జారీచేసింది. దీంతో చాలామంది పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే వారు తప్పనిసరిగా ఉద్యోగానికి రాజీనామా చేయాలని, ఆ నిబంధన స్థానిక ఎన్నికలకు వర్తించదని కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. వాదోపవాదాలు విన్న కోర్టు.. కార్మికులకు అనుకూలంగా దిగువ స్థాయి కార్మికులు పోటీచేయొచ్చని ఉత్తర్వులు ఇచ్చింది.
అయినా, ప్రతీ స్థానిక ఎన్నికల సందర్భంగా పోటీ చేయకూడదని యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తోంది. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌లో మేనేజర్, సెక్రటరీలు తప్ప మిగిలిన ఉద్యోగులు పోటీ చేసేందుకు అర్హులని పేర్కొన్నా.. సింగరేణి ఇప్పటివరకు ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో ఆశావహుల్లో నిరాశ నెలకొంది. సింగరేణి పరిధిలో దాదాపు 42 వేల మంది కార్మికులు ఉన్నారు.


