పెరిగిన ప్రాజెక్టులతో నిర్వహణ బేజారు
విరమణలతో సమస్యలు తీవ్రం
డీసిల్టింగ్ నుంచి ఫ్లై ఓవర్ల వరకు ప్రభావం
సాక్షి, హైదరాబాద్: నగరం మూడు కార్పొరేషన్లుగా మారింది. విస్తరణ నానాటికీ పెరుగుతోంది. కొత్త కాలనీలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, వర్షపు నీటి కాలువలు, చెరువుల తదితర పనులు తప్పనిసరిగా మారుతున్నాయి. ఈ తరుణంలో పనులు పర్యవేక్షించాల్సిన ఇంజినీర్ల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గుతోంది. మూడు కార్పొరేషన్లలో.. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో ఇంజినీర్ల కొరత తీవ్రమైంది. వర్షాకాలం మొదలైన ఈ సమయంలో నాలాల డీ–సిల్టింగ్, ముంపు నివారణ చర్యలు, రోడ్ల మరమ్మతులు, అత్యవసర నిర్వహణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాల్సి ఉంది. మరోవైపు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పనులు ఇటీవలే పట్టాలకెక్కాయి. అయినా అన్ని విభాగాల్లోనూ ఇంజినీర్ల కొరత తీవ్రమైంది.
పెరగని ఇంజినీరింగ్ యంత్రాంగం
ప్రస్తుతం అనేక సర్కిళ్లు, డివిజన్లలో ఒకే ఇంజినీర్ రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫీల్డ్ తనిఖీలు, కాంట్రాక్టర్ల పనుల పర్యవేక్షణ, కోర్టు కేసులు, టెండర్లు, బిల్లుల పరిశీలన, అత్యవసర వర్షాకాల చర్యలు అన్నీ ఒకే అధికారిపై పడుతున్నాయి. దీంతో ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన పనులు ఆలస్యమవుతున్నాయని, ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. మే ఆఖరుకల్లా నాలాల డీ–సిల్టింగ్ పూర్తి కావాలి. కానీ చాలా ప్రాంతాల్లో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. దీంతో పనులు ఆలస్యమవుతున్నాయి.
పదవీ విరమణలతోనూ..
ఇప్పటికే ఖాళీలు అధికంగా ఉండగా, రాబోయే నెలల్లో మరికొందరు సీనియర్ ఇంజనీర్లు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అనుభవజ్ఞులైన అధికారుల సంఖ్య మరింత తగ్గనుండటంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా మారాక ఏ ఒక్క కార్పొరేషన్‌లోనూ సీఈలు లేక ఎస్‌ఈలే సీఈలుగానూ వ్యవహరిస్తున్నారు. ఈఈలే ఎస్‌ఈలుగానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలోనూ పలువురు ఈ నెలతో పాటు రానున్న జూలైలోనూ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కదలిక మొదలైన ప్రాజెక్టు పనులపై తీవ్ర ప్రభావం పడనుంది. కొత్త నియామకాలు జరిగేంత వరకు పదవీ విరమణ పొందనున్న వారికి ఓఎస్డీలుగానైనా ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం అవసరముంది.


