
అల్వాల్(హైదరాబాద్): వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు, ఇంట్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లిన సంఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, మాణిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య (70), రాజమ్మ (65) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావడంతో బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఊరిలో వ్యవసాయం చేసుకునే కనకయ్య, రాజమ్మ వయసు మీద పడడంతో పిల్లల వద్ద ఉందామనే ఆలోచనతో మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కనకయ్య అల్వాల్, సూర్యనగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు.
కొన్నాళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురి కావడంతో ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమీపంలో ఉంటున్న కూతురు లత ఇంటికి వెళ్లి సామన్లు సర్దుకునేందుకు అవసరమైన సంచులు కూడా తెచ్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వారి కుమార్తె లత ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. ఇద్దరి తలలపై గాయాలు ఉన్నాయి. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లత కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాగిలాలను రప్పించి పరిసరాల్లో తనిఖీలు చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు.

గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లో చొరబడి దొంగతనాలు పాల్పడి ఉంటారని, ఈ క్రమంలోనే వారిపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, వెండి పట్టీలు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కనకయ్య తమ వద్ద ఉన్న నగదు అవసరమైన వారికి వడ్డీకి ఇచ్చే వాడని తాను ఊరికి వెళ్లి రూ. లక్ష తీసుకువచ్చానని, అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తానని చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ డీసీపీ సుధీర్ కుమార్, ఏసీపీ రాములు, సీఐ రాహుల్‌దేవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.