
లాభాల బాటలోకి నాగ్‌పూర్ వందేభారత్ రైలు
రెండు అదనపు హాల్టులు.. 300 మంది ప్రయాణికులు.. రూ.2.50 లక్షల టికెట్ ఆదాయం. ఓ చిన్న మార్పు నాగ్‌పూర్ వందేభారత్ రైలు ఆక్యుపెన్సీ, రోజువారీ ఆదాయం పెంచేలా చేసింది. సర్వీసు ప్రారంభంలో సరైన రూట్ సర్వే చేయకుండా తీసుకున్న నిర్ణయం వల్ల సికింద్రాబాద్–నాగ్‌పూర్ వందేభారత్ రైలు అతి తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తూ నష్టాల సర్విసుగా నిలిచింది. ఇప్పుడు చేసిన మార్పు వల్ల అది లాభాల సర్విసుగా మారిపోయింది.
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య గతేడాది సెప్టెంబర్ లో వందేభారత్ సర్విసును ప్రారంభించారు. ఆ సమయానికి మిగతా రూట్లలో 16 కోచ్‌ల వందేభారత్ రైళ్లు తిరుగుతుండగా, నాగ్‌పూర్ సర్విసును మాత్రం ఒకేసారి 20 కోచ్‌లతో ప్రారంభించారు. దేశంలో 20 కోచ్‌లతో తిరిగే రెండో సర్విసు ఇదే కావటం విశేషం. ఆక్యుపెన్సీ రేషియో 30 శాతం కూడా లేకపోవటంతో ఇటీవల కోచ్‌ల సంఖ్యను ఒకేసారి 8కి కుదించారు. దీంతో అది మినీ వందేభారత్ సర్విసుగా మారింది. అయినా, ఆక్యుపెన్సీ రేషియో 75 శాతం నుంచి 85 శాతం మధ్యలోనే నమోదవుతూ వస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ రూట్ సర్వే చేసి తప్పిదాన్ని గుర్తించి సరిదిద్దింది.
మంచిర్యాల, సిర్పూర్– కాగజ్‌నగర్ హాల్ట్‌లతో..
ఈ వందేభారత్ రైలుకు ఎక్కువమంది నాగ్ పూర్‌కు (అటు నుంచి అయితే సికింద్రాబాద్‌కు) ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత కీలక ప్రాంతం మంచిర్యాల పట్టణం. కానీ, దీనికి మంచిర్యాల స్టాపే లేదు. మంచిర్యాల తర్వాత కీలక గమ్యం సిర్పూర్–కాగజ్‌నగర్. ఇక్కడ కూడా స్టాప్ లేదు. ఈ లోపాన్ని గుర్తించిన రైల్వే శాఖ ఆ రెండు స్టాప్‌లు కల్పిస్తూ పది రోజుల క్రితం అమలులోకి తెచ్చింది. దీంతో ఒక్క సారిగా రైలు ఆక్యుపెన్సీ రేషియో వందను మించింది. ఈ రైలులో 550 సీట్లు ఉండగా, 600కు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి.
స్టాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత...
⇒ ఈ నెల 22న ప్రయాణికుల సంఖ్యను పరిశీలిస్తే.. ఆ రోజు సికింద్రాబాద్–నాగ్‌పూర్ వైపు ట్రిప్పులో మొత్తం 588 మంది ప్రయాణించారు. అందులో నాగ్‌పూర్‌లో దిగిన వారు 238 మంది. మొత్తం ప్రయాణికుల్లో అది 40 శాతం. ఆ తర్వాత ఎక్కువ మంది దిగిన స్టాప్ మంచిర్యాలనే. అక్కడ 107 మంది దిగారు. ఇది మొత్తం ప్రయాణికుల్లో 18 శాతం. సిర్పూర్–కాగజ్‌నగర్‌లో దిగిన వారు 40 మంది. సికింద్రాబాద్ వైపు ట్రిప్పులో 11 మంది. ఈ రెండు స్టాప్‌ల ఏర్పాటుతో ఆ రోజు రైల్వేకు వచ్చిన అదనపు ఆదాయం రూ.2.06 లక్షలు.
⇒ ఈ నెల 24: ఆ ట్రిప్పులో ప్రయాణించిన మొత్తం మంది 605 మంది. ఇందులో నాగ్‌పూర్‌కు వెళ్లినవారు 239 అయితే, మంచిర్యాలలో దిగిన వారు 99 మంది, సిర్పూర్‌లో దిగిన వారు 77 మంది. సికింద్రాబాద్ వైపు ట్రిప్పులో మరో 12 మంది ప్రయాణించారు. ఆ రోజు ఈ రెండు స్టాప్‌ల ద్వారా వచ్చిన అదనపు ఆదాయం రూ.2.63 లక్షలు.