Sandy Reddy: ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే!

Sandy Reddy: Strathfield Council Member in Hyderabad - Sakshi

ఖర్చు పెట్టిన డబ్బులపై ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిందే

నెలలో 8 సార్లు సమావేశాలు తప్పనిసరి 

ఆస్ట్రేలియాలోని స్ట్రాత్‌ ఫీల్డ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌ శాండీరెడ్డి   

హైదరాబాద్:  భాగ్యనగరానికి చెందిన ఆ యువతి ఆస్ట్రేలియాలోని స్ట్రాత్‌ ఫీల్డ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గా సేవలు అందిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో నివసించే పట్లోళ్ల శంకర్‌రెడ్డి, సరళారెడ్డి దంపతుల కూతురు శాండీరెడ్డి ప్రస్తుతం స్ట్రాత్‌ ఫీల్డ్‌ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అబిడ్స్‌లోని స్టాన్లీ స్కూల్‌లో 10వ తరగతి వరకు, మెహిదీపట్నం సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలో డిగ్రీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీజీ చేసిన శాండీరెడ్డి వివాహ అనంతరం సిడ్నీ వెళ్లారు. అక్కడి పౌరసత్వం తీసుకుని పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. స్టేట్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌లో స్వచ్ఛంద సేవలు అందించారు. ఆమె సేవలకు ముగ్ధులైన ఆ ప్రాంతవాసులు గత ఏడాది జరిగిన స్ట్రాత్‌ ఫీల్డ్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలని ప్రోత్సహించారు. దీంతో  ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో చేసి విజయం సాధించారు. ఇటీవల సంక్రాంతికి పండగ కోసం ఆమె నగరానికి వచ్చారు. అక్కడ కౌన్సిలర్‌గా విధులు, ప్రజలకు చేస్తున్న సేవలను వివరించారు.   

స్ట్రాత్‌ ఫీల్డ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం ఏడుగురు కౌన్సిలర్లు ఉంటారు. అందులో నేను ఒకదానిని. మాకు ప్రతి నెలా 8 షెడ్యూల్డ్‌ మీటింగ్స్‌ కౌన్సిల్‌లో ఉంటాయి. మాకు వచ్చే ఫిర్యాదులను ఈ సమావేశాల్లోనే కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తుంటాం. అక్కడ ఎక్కువగా ఈ–మెయిల్‌ ద్వారానే ఫిర్యాదులు అందుతుంటాయి. ప్రతి ఫిర్యాదును స్వీకరించి కౌన్సిల్‌లో పెడతాం. ఆ సమస్యకు గల కారణం, ఎప్పుడు పరిష్కారం అవుతుంది? తదితర అంశాలను ఫిర్యాదు చేసిన వ్యక్తికి తిరిగి ఈ–మెయిల్‌లోనే పంపించడం జరుగుతుంది.  

మా కార్పొరేషన్‌లో ఖర్చు చేసే ప్రతి పైసాను స్థానికులు అడిగి తెలుసుకుంటారు. దేనికైనా డబ్బులు ఖర్చు పెడితే అనవసరమైన పక్షంలో ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారని నిలదీస్తారు. మేం చెల్లించే పన్నుల ద్వారా జరిగే అభివృద్ధి పనులను మాకు తెలియకుండా చేయకూడదని, ఖర్చు కూడా పెట్టొద్దని అంటుంటారు. తమ ప్రాంతంలో ఏదైనా కొత్త పని కావాలన్నా మాకు ఈ–మెయిల్‌ చేస్తుంటారు. లైట్లు వెలగకున్నా ఫోన్‌ చేస్తుంటారు. వాటిని మేం సమావేశాల్లో పెడతాం. 

ప్రతి వారం చెత్త తీసుకెళ్తారు.. 
మా కార్పొరేషన పరిధిలో వారానికి ఒకసారి చెత్తను తీసుకెళ్తారు. ఈ వారం రోజుల పాటు ప్రజలు తమ ఇళ్లల్లోని చెత్తను రోడ్డు పక్కన పెద్ద పెద్ద డబ్బాల్లో వేస్తుంటారు. రోడ్డు మీద చెట్టు నుంచి రాలిపడ్డ ఆకు కూడా కనిపించదు. ఇక వారంలో రెండు సార్లు రీసైక్లింగ్‌ వ్యర్ధాలను,  చెట్ల నుంచి రాలి పడ్డ ఆకులు, పెరిగే గడ్డి, విరిగిపడే చెట్ల కొమ్మలను తీసుకెళ్తుంటారు.  

ఎవరైనా తమ ఇంట్లో కుర్చీలు, టేబుళ్లు విరిగిపోయినా, పాత వస్తువులు పేరుకుపోయినా, పరుపులు, దిండ్లు, ఇతర వస్తువులు ఉంటే వాటిని తీసుకెళ్లాలని కౌన్సిల్‌కు సమాచారం ఇస్తారు. వారం రోజుల్లోనే కౌన్సిల్‌ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి ఆ మొత్తం వ్యర్థాలను తరలిస్తారు. అంతేగాని ఎక్కడంటే అక్కడ వాటిని వేయడం కుదరదు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిడ్నీలో ప్రజలకు భారీగా జరిమానాలు విధిస్తారు. జరిమానాలకు భయపడి చాలా మంది తప్పులు చేయరు. 
 

హైదరాబాద్‌లో హెవీ ట్రాఫిక్‌.. 

హైదరాబాద్‌లో గత వారం రోజులుగా వివిధ ప్రాంతాలకు వెళుతున్నాను. విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటోంది. కాలుష్యం కూడా బాగా పెరిగింది. పలు చోట్ల ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు ఇరుక్కుంటున్నాయి. ఈ దృశ్యాలు నా మనసును కలచివేశాయి. ప్రజల్లో బాగా చైతన్యం రావాల్సి ఉంది. సిడ్నీ, మెల్‌బోర్న్‌ నగరాల్లో అంబులెన్స్‌ వస్తుంటే వాహనాలు రెండు వైపులకు తప్పించి అంబులెన్స్‌ను ముందుకు పంపిస్తారు. ఇక్కడ ఆ అవగాహన కనిపించడం లేదు. ట్రాఫిక్, కాలుష్యం తగ్గాలంటే వాహనల సంఖ్య కూడా తగ్గి ప్రజా రవాణా వ్యవస్థ సిడ్నీ నగరంలా పెరగాలి. (క్లిక్ చేయండి: భారత సంతతి వైద్యుడికి యూఎస్‌ సీడీసీలో కీలక పదవి)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top