సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు రేపు(శుక్రవారం) విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప ఎవరికి అనుమతి ఉండదు అని సూచించారు.
జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ మీడియాతో మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తాం. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. స్పెషల్ పర్మిషన్‌తో ఈసారి 42 టేబుల్స్ ఏర్పాటు చేశాం. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి స్పెషల్ అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 186 మంది కౌంటింగ్ సిబ్బంది పని చేస్తారు. కౌంటింగ్‌ను ఎప్పటికప్పుడు RO పరిశీలిస్తారు. LED స్క్రీన్ ద్వారా, EC యాప్ ద్వారా ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తాం. అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప ఎవరికి అనుమతి ఉండదు అని చెప్పుకొచ్చారు.
జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ..‘రేపు కౌంటింగ్ కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశాం. అన్ని విభాగాల పోలీసు బృందాలను అందుబాటులో ఉంచాం. రేపు కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.


