9న ఎన్నికలు... స్పెషల్ బస్సులు మొదలు
ఎక్కువ మంది డ్రైవర్లు, కండక్టర్లు గైర్హాజరయ్యే పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. బతుకమ్మ పండుగను అసుసరించి వచ్చే పర్వదినం కావటంతో సింహభాగం జనం సొంతూళ్లకు వెళతారు. దీంతో ఆర్టీసీ ఆ సమయంలో ప్రత్యేక బస్సులు తిప్పుతుంది. కానీ, ఈసారి ప్రణాళికాలోపం వల్ల ఆర్టీసీకి పెద్ద సవాల్ ఎదురైంది. విద్యాసంస్థలకు సెలవుల నేపథ్యంలో ఈనెల 9 నుంచి పెద్ద సంఖ్యలో జనం సొంతూళ్లకు వెళ్లటం ప్రారంభిస్తారు. దీంతో అదే రోజు నుంచి ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను ప్రారంభిస్తోంది. కానీ, సరిగ్గా అదే రోజు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి.
సాధారణంగా ఎన్నికల రోజు సిబ్బంది ఎక్కువగా విధులకు దూరంగా ఉంటారు. ఓటర్లలో 90 శాతం మంది డ్రైవర్లు, కండక్టర్లే అయినందున, వారి హాజరు పలచగా ఉండటంతో బస్సుల సంఖ్య తక్కువగా తిరుగుతుంది. కానీ, అదే రోజు నుంచి స్పెషల్ బస్సులు తిప్పుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. సాధారణ సమయంలోనే, స్పెషల్ బస్సులకు సిబ్బంది సరిపోక డబుల్ డ్యూటీలు వేస్తారు. అయితే ఎన్నికలున్నందున డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీకి ఎగ్గొట్టే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక సాయంత్రానికి కౌంటింగ్ పూర్తయి ఫలితాలు కూడా అనధికారికంగా వెల్లడవుతాయి. అధికారికంగా 17వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నా, అనధికారికంగా తొమ్మిదో తేదీనే తెలుస్తుంది. దీంతో గెలుపు సంబరాల్లో కొందరు, ఓటమి భారంతో కొందరు విందుల్లో ఉండే అవకాశం ఉంటుంది.డ్యూటీకి వెళ్లే ముందు బ్రీథ్ అనలైజర్ పరీక్ష జరుపుతారు. ఈ కారణంగా కూడా కొందరు గైర్హాజరవుతారు. వెరసి ఈ దసరా ప్రత్యేక బస్సుల వ్యవహారం ఇప్పుడు ఆర్టీసీలో గందరగోళంగా మారింది.
ఆర్టీసీ మాటను పట్టించుకోని కార్మిక శాఖ
ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలను కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. రిటర్నింగ్ అధికారి కూడా ఆ శాఖకు చెందినవారే ఉంటారు. ఎన్నిక తేదీని కార్మిక శాఖ ప్రకటించేసింది. దసరా, దీపావళి పండుగలు ఉన్నందున... ప్రయాణికుల రద్దీ ఉంటుందని, నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ కోరినా పట్టించుకోకుండా కార్మిక శాఖ ఈనెల 9ని ఖరారు చేసింది. దీంతో ఇప్పుడు అంతా గందరగోళంగా మారింది.
ఇక ఔట్ సోర్సింగ్ సిబ్బందిపైనే భారం...
ప్రస్తుతం ఆర్టీసీలో 2 వేల మంది ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, 1250 మంది కండక్టర్లు ఉన్నారు. వీరు కచ్చితంగా విధుల్లోకి వచ్చేలా, డబుల్ డ్యూటీ చేసేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు కూడా ఓటర్లు కానందున వారు కూడా డ్యూటీలో ఉంటారు.


