భయపడే ప్రసక్తే లేదు.. చావుకైనా సిద్ధం: ప్రవీణ్‌ కుమార్‌

RS Praveen Kumar Comments On Police Case - Sakshi

స్వేరోస్‌ వ్యవస్థాపకుడు ప్రవీణ్‌కుమార్‌  

దళిత బిడ్డలు ఎన్నిరోజులు రోడ్లు ఊడ్వాలి? 

29 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలీసు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్వేరోస్‌ వ్యవస్థాపకుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. బహుజన రాజ్యాధికార సాధన కోసం మరణించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పదవీ విరమణ చేసిన మరుసటి రోజే పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన స్వేరోస్‌ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  

కోట్లాది మంది ప్రవీణ్‌కుమార్‌లు పుట్టుకొస్తారు 
అంబేడ్కర్‌ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఒక్క ప్రవీణ్‌కుమార్‌పై కేసులు పెడితే కోట్లాది మంది ప్రవీణ్‌కుమార్‌లు పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావని తన తల్లి ప్రశ్నిస్తే కోట్లాది మంది దళిత బిడ్డలను బాగు చేసేందుకే రాజీనామా చేశానని చెప్పానని తెలిపారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ గురించి నాలుగేళ్ల చిన్నపిల్ల ఎంతో చక్కగా మాట్లాడిందని, అలాంటి ధైర్యం ఆ 29 మంది ఎమ్మెల్యేలకు ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదని విమర్శించారు.

హుజురాబాద్‌లో దళితబంధు పథకాన్ని రూ.వెయ్యి కోట్లతో అమలు చేయాలని అనుకుంటున్నారని, ఆ డబ్బులతో దళిత బిడ్డలను అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదివించేందుకు పంపితే సత్య నాదెళ్ల, బిల్‌గేట్స్, సుందర్‌ పిచాయ్‌లు అవుతారని పేర్కొన్నారు. తమ బిడ్డలు ఎన్ని రోజులు రోడ్లు ఊడ్వాలని, ఎన్ని రోజులు కల్లు గీయాలని, గొర్లు.. బర్లు కాయాలని ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. అమెరికా, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్లకూడదని అన్నారు.

మన రాజ్యం వస్తుందని ప్రచారం చేయాలి 
వందల సంవత్సరాలుగా దళితులు అణచివేతకు గురవుతున్నారని, వారిపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మటన్, చికెన్‌ దావత్, బీరు, బిర్యానీలు, తాయిలాలకు మోసపోయే జాతులు మనవి కావని, రాజ్యాధికారం సాధించుకునేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మన రాజ్యం వస్తుందని అలంపూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు, తాండూర్‌ నుంచి నల్లగొండ వరకు ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

వీణ్‌కుమార్‌పై కేసు నమోదు 
కరీంనగర్‌ క్రైం: మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరొకరిపై కరీంనగర్‌ త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మార్చిలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్‌(దూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్‌ కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్, ఎన్‌.శంకర్‌బాబు హిందువుల మత విశ్వాసాలను కించపరిచే విధంగా వ్యవహరించారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి మార్చి 22న తన న్యాయవాది ద్వారా కరీంనగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం గురువారం రాత్రి ప్రవీణ్‌కుమార్, శంకర్‌లపై కరీంనగర్‌ త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top