ప్రతిపాదనల్లో మరో రూ.28 వేల కోట్ల పనులు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డు
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలోనే ఒకేసారి రూ.60,799 కోట్ల తో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. వీటితోపాటు మరో రూ.28 వేల కోట్లతో చేపట్టనున్న మన్ననూరు నుంచి శ్రీశైలం, ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్ట్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రతిపాదనలో ఉన్నాయన్నారు. ఈ మేరకు మంత్రి వెంకట్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచంలోని పెట్టుబడిదారులంతా తెలంగాణకు తరలివచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని వెల్లడించారు.
హైదరాబాద్– విజయవాడ 8 లేన్ల రహదారిగా విస్తరణ
అబ్దుల్లాపూర్ ఇండస్ట్రియల్ పార్కు నుంచి విజయవాడ వరకు ఉన్న 4 లేన్ల జాతీయ రహదారిని 8 లేన్ల రహదారిగా విస్తరించనున్నట్టు మంత్రి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఇందులో ఆరు లేన్లు ప్రధాన రహదారి కాగా, రెండింట్లో సర్వీసు రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.10,400 ఖర్చు చేస్తామని చెప్పారు. రాష్ట్ర గతిని మార్చే రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి రూ.36,000 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఆరు లేన్లుగా నిర్మించబోతున్న ట్రిపుల్ ఆర్ అన్ని జిల్లాలను కలుపుతుందని వివరించారు. రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం.. సింగిల్ రోడ్డు ఉన్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం, రూ.11,399 కోట్లతో చేపట్టే హెచ్‌ఏఎం ప్రాజెక్టునకు కొద్ది రోజుల్లో టెండర్లు పిలుస్తున్నామని మంత్రి చెప్పారు. వీటితోపాటుగా అదనంగా మరో 28 వేల కోట్లతో చేపట్టనున్న పనులు ప్రతిపాదనలో ఉన్నాయని తెలిపారు.
రూ.8వేల కోట్లతో మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
రూ.8,000 కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు తుదిదశకు చేరాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో రహదారులపై ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రహదారుల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సమీక్షిస్తారని చెప్పారు. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ రహదారులకు సంబంధించిన అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకురావడంతోనే రహదారుల విషయంలో గొప్ప ప్రగతి కనిపించిందని మంత్రి తెలిపారు.


