రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Revanth Reddy Taking Oath: Traffic Restrictions In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రేపు కొత్త సర్కార్‌ కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.

గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా వేరే​ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..
పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు, ఎస్‌బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి వైపు, సుజాత స్కూల్‌ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించనున్నారు.

ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపటి సభలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై  రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక.. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదికను ఏర్పాటు చేశారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేశారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ, తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ, ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top