ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం | Revanth Reddy calls for action plan to tackle El Nino impact | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం

Oct 11 2026 5:21 AM | Updated on Oct 11 2026 5:21 AM

Revanth Reddy calls for action plan to tackle El Nino impact

సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీఎస్‌ సంజయ్‌జాజు, డీజీపీ ఆనంద్, వేం, రామకృష్ణారావు

సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్‌ రెడ్డి 

కొందామంటే విద్యుత్‌ లభించడం లేదు.. పొదుపుగా వాడుకోవాలి

చేతికొచ్చిన పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలి

పకడ్బందీ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణ చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితులపై జూబ్లీహిల్స్‌ నివాసంలో శనివారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండటంతో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తాగు నీరు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్‌ సమస్యల విషయంలో సరైన యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్‌లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. సమస్యలను ఎదుర్కొనడానికి అవసరమైన అన్ని రకాల  ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

రాబోయే 8 నెలలు కీలకం
ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాబోయే 8 నెలలు కీలకమని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ 8 నెలల్లో ప్రతీ కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని, పకడ్బందీ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంపై సినిమా, మీడియా, కళాజాతలతోపాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు వేసిన పంటల పరిస్థితులను అంచనావేసి పంట చేతికొచ్చే వరకు నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 

తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ..
రాబోయే రోజుల్లో విద్యుత్‌ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని సీఎం తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నా, మార్కెట్‌లో విద్యుత్‌ అందుబాటులో లేదన్నారు. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. విద్యుత్‌ ఆధారిత పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై త్వరలో మంత్రులతో ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు సూచించారు. అదనపు పని దినాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసే అంశాన్ని మంత్రుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దసరా తరువాత గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు వార్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాను ఎప్పటికప్పుడు సీఎంఓ ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement