రూల్స్‌ నందు పోలీసు రూల్స్‌ వేరయా..! 

Restrictions :Traffic Police Removed Free Parking In Basheerbagh - Sakshi

బషీర్‌బాగ్‌ చౌరస్తాలో పోలీసుల అక్రమ పార్కింగ్

 సామాన్యుల కోసం కేటాయించిన  ఉచిత పార్కింగ్‌ బోర్డు తొలగింపు 

పోలీసులకో రూలు.. సామాన్యులకు మరో రూలు..!

సాక్షి, అబిడ్స్‌: నగర ట్రాఫిక్‌ పోలీసులు సామాన్యులకో రూలు, పోలీసులకు మరో రూలు విధిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బషీర్‌బాగ్‌ చౌరస్తాలోని బ్రిడ్జి కింద వాహన దారులు ఉచితంగా పార్కింగ్‌ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు బషీర్‌బాగ్‌ చౌరస్తా పరిసరాల్లో ఉచిత పార్కింగ్‌ ప్రదేశాలు నాలుగేళ్ల క్రితమే గుర్తించారు. దీంతో బషీర్‌బాగ్‌ పరిసరాల్లో ఉండే బాబూఖాన్‌ ఎస్టేట్, ఇన్‌కంటాక్స్‌ కార్యాలయాలు, ఎల్‌ఐసీ కార్యాలయాలు, ఇతర కార్యాలయాలకు చెందిన సిబ్బందితో పాటు కార్యాలయాలకు వచ్చే వారు కూడా ఉచితంగా తమ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు.  

ఉచిత పార్కింగ్‌ను తొలగించిన ట్రాఫిక్‌ అధికారులు..
నాలుగేళ్లుగా  బషీర్‌బాగ్‌ బ్రిడ్జి ఇరువైపులా, బ్రిడ్జి కింద ఉచిత పార్కింగ్‌ను ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు తొలగించారు. నో పార్కింగ్‌ బోర్డు పెట్టి ఈ స్థలాల్లో ఎవరూ వాహనాలు నిలుపరాదని నిషేధాజ్ఞలు విధించారు. కేసీఆర్‌ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నగరంలో ఉచిత పార్కింగ్‌ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా బషీర్‌బాగ్‌ చౌరస్తాలోని బ్రిడ్జి ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఉచిత పార్కింగ్‌కు అనుమతి ఇవ్వడంతో స్థానిక కార్యాలయాలకు వచ్చే వారికి ఎంతో  వీలుగా ఉండేది.  


బషీర్‌బాగ్‌ బ్రిడ్జి కింద ఉచిత పార్కింగ్‌ బోర్డును తొలగించి నో పార్కింగ్‌ బోర్డు పెట్టిన ట్రాఫిక్‌ పోలీసులు

ట్రాఫిక్‌ రూల్స్‌ వర్తించవా...? 
బషీర్‌బాగ్‌ చౌరస్తాలో నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వచ్చేవారు అమ్మవారి ఆలయం ఎదురుగా నిజాం కాలేజీ గ్రౌండ్‌ గేటు పక్క అక్రమంగా నడి రోడ్డు వరకు తమ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. పోలీసులు, పోలీసు కార్యాలయాలకు వచ్చే వారు ట్రాఫిక్‌ రూల్స్‌కు విరుద్దంగా రోడ్డుపై వాహనాలను పార్కు చేస్తే పట్టించుకునే వారే లేరు. ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం ఉచిత పార్కింగ్‌ను తొలగించి నడిరోడ్డుపై  పార్కు చేసే పోలీసు వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం వాహనదారుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత పార్కింగ్‌ను ట్రాఫిక్‌ పోలీసులు తొలగించడం సరి కాదని పలువురు వాపోతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు ఒక రూలు, సామాన్య ప్రజలకు మరో రూలు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.  

తిరిగి ఉచిత పార్కింగ్‌కు అనుమతి..
బషీర్‌బాగ్‌ బ్రిడ్జికింద వాహనాలు పెద్ద ఎత్తున పార్క్‌ చేస్తుండడంతో ధర్నాలు, ఆందోళనలు చేపట్టినప్పుడు ఇబ్బంది కలుగుతుందనే దృష్టితోనే నో పార్కింగ్‌ బోర్డు పెట్టామని ట్రాఫిక్‌ ఏసీపీ మురళీకృష్ణ తెలిపారు. సామాన్య ప్రజలకు ఒక రూరు, పోలీసులకు ఒక రూలా అని ‘సాక్షి’ ఏసీపీ మురళీ కృష్ణను వివరణ కోరింది. త్వరలోనే సంబంధిత ఇన్‌స్పెక్టర్లకు చెప్పి ప్రజల సౌకర్యార్థం బషీర్‌బాగ్‌ బ్రిడ్జికింద గతంలోనే మాదిరిగానే ఉచిత పార్కింగ్‌ కొనసాగించే విధంగా చూస్తామని పేర్కొన్నారు. 

చదవండి: 
మందుబాబులు చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా?

సిగ్నల్‌ జంప్: ఏయ్‌ నన్నే ఆపుతావా? 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top