జీఓ 9లో అభ్యంతరకరనిబంధనలను నిలిపివేసిన హైకోర్టు
బకాయిల చెల్లింపుపై స్పష్టతఇవ్వకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు
30వ తేదీన ఏజీ హాజరై వివరాలుతెలియజేస్తారన్న స్పెషల్ జీపీ
అప్పటివరకు జీఓలోని 4 పేరాలు నిలిపేయాలన్న పిటిషనర్ల లాయర్లు
సమ్మతించిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి.. 4 పేరాలు 30 వరకు నిలిపివేత
తమ ఇబ్బందులను తెలియజేస్తూ పలువురు విద్యార్థుల ఇంప్లీడ్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కళాశాలలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫీజు వసూలు, రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఈ నెల తొలివారంలో జారీ చేసిన జీఓ నంబర్ 9లోని నాలుగు మార్గదర్శకాలపై మధ్యంతర స్టే విధించింది. వచ్చే మంగళవారం (30వ తేదీ) వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపు, కొత్త ఫీజులకు బడ్జెట్‌లో ఎంత కేటాయించారని, బడ్జెట్ సెషన్ కూడా ముగిసినట్టుంది కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెండింగ్ బకాయిల చెల్లింపుపై స్పష్టత వచ్చిందా అని స్పెషల్ జీపీని అడిగింది.
ప్రస్తుతం తను ఎలాంటి వాదనలు వినిపించలేనని, అడ్వొకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపిస్తారని, మంగళవారం వరకు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్, న్యాయవాది తరణ్ జీ రెడ్డి జోక్యం చేసుకొని.. అప్పటివరకు జీఓ 9లోని ఫీజులకు సంబంధించిన పేరా 5.2(ఈ), 10.2, 10.4, 12.1(ఏ)లను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి సమ్మతిస్తూ విచారణ వాయిదా వేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న జారీ చేసిన జీఓ 7లోని ఓ క్లాజ్‌ను సవాల్ చేస్తూ పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు ఈ క్లాజ్ విరుద్ధమని పేర్కొన్నాయి. ఈ క్లాజ్ ప్రకారం ప్రవేశ సమయంలో ట్యూషన్ ఫీజు సహా ఇతర ఫీజుల కోసం విద్యార్థులను కాలేజీలు ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
అన్ని అంశాలపై ఏజీ స్పష్టత ఇస్తారు..
ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆగస్టు 15న కొంతమేర చెల్లింపులు చేస్తామని జీఓ ఉందన్నారు. అడ్మిషన్లన్నీ పూర్తయి, అప్లికేషన్లు పంపే వరకు ఆగస్టు 1 వస్తుందని, పదిహేను రోజుల్లో ఫీజులు విడుదల చేస్తామని ఉత్తర్వులో చెప్పారన్నారు. ఈ పిటిషన్లలో అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరై వాదనలు వినిపిస్తారని, అన్ని అంశాలపై స్పష్టత ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం తాను ఎలాంటి వాదనలు వినిపించలేనన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్, తరణ్ జీ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏజీ హాజరయ్యే వరకు జీఓ 9లోని అభ్యంతరకర నిబంధనలపై సస్పెన్షన్ విధించాలన్నారు.
ఆగస్టు 15 లోపు బకాయిలు చెల్లిస్తే పిటిషన్ల ఉపసంహరణపై ఆలోచిస్తామన్నారు. మరోవైపు విద్యార్థులు తమ ఇబ్బందులను తెలియజేస్తూ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. కళాశాలలు, ప్రభుత్వానికి మధ్య తాము నలిగిపోతున్నామన్నారు. వారి తరఫు న్యాయవాదు లు వాదిస్తూ.. 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులను ఫీజు చెల్లించాలని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందంటేనే వారు కాలేజీల్లో చేరారని, ఇప్పుడు ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.
చాలా మంది పేద విద్యార్థులున్నారని, తొలి ఏడాది విద్యార్థులకే ఫీజు చెల్లింపు ఉత్తర్వులు అమలు చేసేలా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశా రు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మంగళవారం అందరి వాదనలు విని నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటివరకు నాలుగు పేరాలపై మధ్యంతర సస్పెన్షన్ విధించారు.
ఆ నాలుగు మార్గదర్శకాలు ఇవే..
5.2(ఈ): మెరిట్ ఆధారంగా పారదర్శక అడ్మిషన్లు
అర్హత కలిగిన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా, పూర్తి పారదర్శక విధానంలో కన్వినర్ కోటా సీట్ల ద్వారా ప్రవేశాలు కల్పించాలి. విద్యార్థులకు మంజూరయ్యే స్కాలర్íÙప్ మొత్తాన్ని వారి ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన తర్వాత, అదే మొత్తంతో ట్యూషన్ ఫీజుతోపాటు ఇతర ఫీజులను ఆయా విద్యాసంస్థలకు చెల్లించాలి. ఆగస్టు 15, డిసెంబర్ 30, ఫిబ్రవరి 28.. ఇలా నిర్దేశించిన గడువుల ప్రకారం ఈ ఫీజుల చెల్లింపులు పూర్తి చేయాలి.
10.2: 7 రోజుల్లో ఫీజు చెల్లింపు..
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానంలో విద్యార్థులకు ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ తర్వాత 7 పనిదినాల్లోపు ఆయా విద్యాసంస్థలకు ఫీజులు చెల్లించాలి. నిర్ణీత గడువులో చెల్లింపులు పూర్తి చేయడం విద్యార్థుల బాధ్యత.
10.4: ఫీజు చెల్లింపు హామీతోనే అడ్మిషన్..
అర్హత కలిగిన విద్యార్థులకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించేటప్పుడు ఈ జీఓలోని మార్గదర్శకాల ప్రకారం ఫీజుల చెల్లింపు జరిగేలా నిర్ధారించుకోవాలి. స్కాలర్‌షిప్ ఆధారంగా ఫీజు చెల్లింపు జరుగుతుందనే ప్రాతిపదికపైనే కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్లు మంజూరు చేయాలి.
12.1(ఏ): డీబీటీ విధానం తప్పనిసరి..
ప్రతీ విద్యాసంస్థ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. అర్హత ఉన్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే సమయంలో ట్యూషన్, హాస్టల్ ఫీజును కూడా విద్యార్థులే తమ ఖాతాల్లో జమయ్యే స్కాలర్íÙప్ మొత్తంతో విద్యాసంస్థలకు చెల్లించే విధానాన్ని గౌరవించాలి.


