‘రింగు’ యమ కాస్ట్‌లీ! | Regional Ring Road: Rs 52. 5 crore for construction of kilometer road | Sakshi
Sakshi News home page

‘రింగు’ యమ కాస్ట్‌లీ!

Dec 30 2024 5:28 AM | Updated on Dec 30 2024 5:28 AM

Regional Ring Road: Rs 52. 5 crore for construction of kilometer road

కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి రూ.52.5 కోట్ల వ్యయం

మొత్తం రూ.8,500 కోట్ల ఖర్చవుతుందన్న ఎన్‌హెచ్‌ఏఐ.. ఎలివేటెడ్‌ కారిడార్‌ తరహా నిర్మాణం

3 భారీ వంతెనలు, 190 చిన్న వంతెనలు, అండర్‌పాస్‌ల వల్లే ఎక్కువ ఖర్చు

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి రూ.8,500 కోట్లు ఖర్చవుతుందని ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్‌లో పేర్కొంది. 162 కి.మీ నిడివితో ఉండే ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతి కిలోమీటరుకు ఏకంగా రూ. 52.5 కోట్లు ఖర్చు కానుంది. 8 వరసలుగా ప్రతిపా దించినప్పటికీ, ప్రస్తుత ట్రాఫిక్‌ రద్దీ తక్కువగా ఉండటంతో 4 వరసలను మాత్రమే నిర్మించనున్నారు. భవిష్యత్తులో దాన్ని 8 వరసలకు విస్తరిస్తారు. మరి 4 వరసల నిర్మాణానికే ఇంత భారీ వ్యయం ఎందుకు అవుతోందో చూద్దాం..

5 మీటర్ల ఎత్తుతో నిర్మాణం
ఇది పూర్తి యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే. ఢిల్లీ చుట్టూ నిర్మిస్తున్న ఔటర్‌ రింగురోడ్డు స్థాయిలో దీనికి ప్లాన్‌ చేశారు. కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఆటంకాలు తలెత్తని రీతిలో నిర్మించబోతున్నారు. నగరం, నగర శివారు ప్రాంతాల్లో అప్పుడప్పుడు రికార్డు స్థాయి వర్షపాతం నమోదై లోతట్టు ప్రాంతాలను మెరుపు వరదలు ముంచెత్తుతాయి. కొన్నిరోజుల పాటు ఆ ప్రాంతాలు నీటిలోనే ఉంటాయి. ఇలాంటి వరదలు ఈ రోడ్డును ఇబ్బంది పెట్టకుండా భూ ఉపరితలం నుంచి 5 మీటర్ల ఎత్తుతో ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించాలని నిర్ణయించారు. దాదాపు 16.4 అడుగుల ఎత్తుతో ఇంచుమించు ఎలివేటెడ్‌ కారిడార్‌ తరహాలో ఉంటుంది. అంతెత్తు మట్టి కట్ట నిర్మించి దానిమీద రోడ్డును నిర్మిస్తారు. 162 కి.మీ రోడ్డును అంత ఎత్తుతో నిర్మించేందుకు భారీ వ్యయం కానుంది. 

3 నదులు.. 3 భారీ వంతెనలు
ఈ మార్గంలో 3 నదుల మీదుగా ఈ రోడ్డు సాగాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో 4 వరసల రోడ్డుకు సరిపోయే వెడల్పుతో 3 భారీ వంతెనలు నిర్మిస్తారు. వలిగొండ వద్ద మూసీ నదిని దాటాల్సి ఉంది. వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద కిలోమీటరు పొడవుతో భారీ వంతెనకు డిజైన్‌ చేశారు. దీనికి దాదాపు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. పుల్కల్‌ మండలం శివంపేట గ్రామం వద్ద మంజీరా నదిని దాటాల్సి ఉంది. ఇక్కడ 600 మీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.75 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇక తూప్రాన్‌ సమీపంలో హరిద్రా నదిని దాటుతుంది. అక్కడ అర కి.మీ పొడవైన వంతెన నిర్మిస్తారు. దీనికి రూ.70 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

190 చిన్న వంతెనలు, అండర్‌ పాస్‌లు
ఇతర రోడ్ల మీదుగా సాగే వాహనాలు దాటేందుకు, కాలువలు, వాగుల్లో పారే నీళ్లు దాటేందుకు వీలుగా రోడ్డు పొడవునా చిన్న వంతెనలు, అండర్‌ పాస్‌లను ప్లాన్‌ చేశారు. ఇవి మొత్తం 190 ఉంటాయి. వీటిల్లో 105 అండర్‌ పాస్‌లు ఉన్నాయి. దిగువన 10 అడుగుల ఎత్తుతో దారి ఉంటుంది. వాటి గుండా ఇతర రోడ్ల వాహనాలు సాగుతాయి. ఈ కల్వర్టులు, అండర్‌పాస్‌లు ఉండే చోట్ల రింగురోడ్డు 5.5 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తారు. ఇక కాల్వలు, చెక్‌ డ్యామ్‌లు, చెరువు కాలువలు, గుట్టల నుంచి జాలువారే నీటి ప్రవాహానికి రింగురోడ్డు అడ్డుగా మారకుండా 85 చిన్న కల్వర్డులు నిర్మించనున్నారు. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా, వీటి గుండా ట్రాక్టర్లు లాంటి వాహనాలు వెళ్లేలా రోడ్డు కూడా ఉంటుంది.

ఇలా పెద్ద, చిన్న వంతెనలు, కల్వర్టులు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని డీపీఆర్‌లో పొందుపరిచారు. ఇక తారు పొరలు కూడా చాలా మందంగా ఉండనున్నాయి. వాహనాలు 120 కి.మీ. వేగంతో దూసుకుపోయేలా నిర్మిస్తున్నందున, అవి జారిపోయే ప్రమాదం లేకుండా రోడ్డుపైన ప్రత్యేక మెటీరియల్‌తో పొరలు నిర్మించనున్నారు. దిగువ తారు పొరలు కూడా చాలా మందంగా నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి మొత్తంగా రూ.8,500 కోట్ల వ్యయం అవనుంది.

Advertisement
 
Advertisement
Advertisement