బ్లాస్టింగ్‌తో.. కంపిస్తున్న భూమి

Quarry Blasting Explosives Harmful To People In Mahabubnagar - Sakshi

సాక్షి, వనపర్తి/కొత్తకోట: గత కొన్నేళ్ల క్రితం మైనింగ్‌ అనుమతి పొందిన ఓ కంపెనీ.. జనావాసాలకు అతి సమీపంలో బ్లాస్టింగ్‌ చేస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి సమీపంలో డ్రిల్లింగ్‌ మిషన్‌కు బదులుగా బోరు డ్రిల్లింగ్‌ చేస్తుండటంతో భూమి దద్దరిల్లడంతో పాటు గ్రా మంలోని పదుల సంఖ్యలో ఇళ్లు నెర్రెలు బారాయి. ఏడాది క్రితం ఈ సమస్యపై గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి బ్లాస్టింగ్‌ను బంద్‌ చేయించారు. ఇటీవల బ్లాస్టింగ్‌ తిరిగి ప్రారంభమవడంతో గ్రామస్తులు ఖంగుతిన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. మాకు అధికారుల నుంచి అనుమతి లభించిందని చెప్పుకొస్తున్నారు. 

ఎండుతున్న బోర్లు 
కంకర కొరకు రోజు బ్లాస్టింగ్‌ చేస్తుండటంతో సమీపంలో గల వ్యవసాయ బోర్లు పూడిపోయి నీళ్లు రాకపోవడంతో పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్‌ పనులు నిలిపేయాలని కోరితే.. క్వారీ యజమాని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.  

కలెక్టరేట్‌లో ఫిర్యాదు  
గుట్టలో అనుమతులకు మించి బ్లాస్టింగ్‌ చేస్తున్న తీరుపై, ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని, భారీ శబ్దాలతో ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఫొటోలతో సహా మండల, జిల్లా స్థాయి అ«ధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా సోమవారం కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో కలెక్టరేట్‌లో బ్లాస్టింగ్‌ బంద్‌ చేయించాలని ఫిర్యాదు చేసి వెళ్లారు. అయినా అ«ధికారుల నుంచి స్పందన లేకపోవటం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ తమ గ్రామాన్ని సందర్శించి బ్లాస్టింగ్‌ను పూర్తిగా నిషేధించాలని గ్రామస్తులు కోరారు. 

కంపిస్తున్న భూమి
సంకిరెడ్డిపల్లి సమీపంలో ‘గొట్టెతేనా’ అనే గుట్ట ఉంది. దీని నుంచి కంకర మిషన్‌కు రాయి సరఫరా కోసం అధికారులు అనుమతులిచ్చారు. ఈమేరకు బ్లాస్టింగ్‌తో చుట్టూ కిలోమీటర్‌ దూరం వరకు భూమి కంపించడంతో పాటు సమీపంలో గల పంట పొలాల రైతులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ప్రతి రోజు బ్లాస్టింగ్‌ చేస్తుండటంతో గ్రామంలో దాదాపు 30ఇళ్లకు పైగా పాక్షికంగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. బ్లాస్టింగ్‌ తిరిగి ప్రారంభమవడంతో నూతనంగా ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం వెనకాడే పరిస్థితి నెలకొంది.  

పరిశీలిస్తాం 
సంకిరెడ్డిపల్లి సమీపంలోని క్రషర్‌లో బ్లాస్టింగ్‌ చేసేందుకు అనుమతుల విషయం మాకు తెలియదు. పాత అనుమతులు ఉన్నట్లుగా తెలుసు. మరొకసారి ఈ విషయంపై దృష్టి సారించి అనుమతుల వివరాలను తెలుసుకుంటాం.  – మల్లిఖార్జున్‌రెడ్డి, సీఐ, కొత్తకోట 

క్వారీ అనుమతి రద్దు చేయాలి 
కాసులకు కక్కుర్తి పడి గ్రామ శివారులోని గుట్టపై రాళ్లు తీయడానికి అనుమతులిచ్చారు. బ్లాస్టింగ్‌తో ఇళ్ల గోడలు పగుళ్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా జీవిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని క్వారీ అనుమతి రద్దు చేసి తమకు న్యాయం చేయాలి. – గీత, సంకిరెడ్డిపల్లి  

ఇంట్లో ఉండలేకపోతున్నాం 
ప్రతి రోజు బ్లాస్టింగ్‌ చేయడంతో పెద్దగా శబ్దాలు వస్తున్నాయి. ఇళ్లు పగుళ్లు ఇచ్చాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నాం. ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తుంది. ఇలాగే ఉంటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపాలి. – భారతమ్మ, సంకిరెడ్డిపల్లి  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top