సాక్షి, మహబూబ్‌నగర్: బీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కేసీఆర్ వివక్షతో చూశారని.. పదేళ్లలో బీఆర్‌ఎస్ పాలమూరులోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదంటూ విమర్శించారు. బీఆర్‌ఎస్ చేతకానితనాన్ని కాపాడుకునేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు జిల్లాలో ఒక్కటైనా ఉందా? అంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు.
సంగబండ పగలగొట్టేందుకు రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదు. గత పాలకులు పదేళ్లు పాలమూరుకు అన్యాయం చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చించమంటే ముఖం చాటేశారు. త్వరలోనే తెలంగాణకు ఐఐఎం కోసం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రధాని మోదీని కలుస్తాం.. ఐఐఎంను కూడా పాలమూరులోనే పెడతాం.. ‘‘మా ఎంపీ డీకే అరుణను ఓడించాలని నేను 14 మీటింగులు పెట్టిన.. కానీ ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు.. పాలమూరు అభివృద్ధికి కలిసి పోతాం. విమర్శలు వస్తుంటాయి.
..దేశ ప్రధానిగా మోదీని అభివృద్ధి కోసం కలుస్తాం.. ఎన్నికలప్పుడు బరాబర్ కొట్లాడతాం. వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ వారిని గెలిపించండి. అందరం కలిసి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.



