మన మక్కలెన్ని? | Procurement of 14 lakh metric tonnes of maize: Telangana | Sakshi
Sakshi News home page

మన మక్కలెన్ని?

Jun 13 2026 5:12 AM | Updated on Jun 13 2026 5:12 AM

Procurement of 14 lakh metric tonnes of maize: Telangana

14 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న సేకరణపై అనుమానాలు 

ఖమ్మంలోనే 3 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు 

నిర్మల్, నాగర్‌కర్నూలులో ఉత్పత్తిని మించి సేకరణ 

ఏపీ, మహారాష్ట్రల నుంచి అక్రమ మార్గాల్లో రాష్ట్రానికి మక్కలు ? 

దళారుల నుంచి నేరుగా మార్క్‌ఫెడ్‌ కొన్నట్టు అనుమానాలు 

ఈ నెల 15–17 తేదీల్లో మక్కల వేలం 

సాక్షి, హైదరాబాద్‌: ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన మక్కల పరిమాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ఉత్పత్తి అయిన దానికంటే ఎక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరిగినట్టు కనిపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి మక్కలు తెలంగాణ మార్కెట్లకు తరలివచ్చాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

ఖమ్మంలో అటు ఇటుగా 3 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను కొనుగోలు చేస్తే..భద్రాద్రి కొత్తగూడెంలో మాత్రం 48 వేల మెట్రక్‌ టన్నులే సేకరించడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోనే ఇంత తేడా ఎలా వచ్చిందనే అనుమానాలు ఉన్నాయి.  

నాగర్‌కర్నూల్‌లో 1.66 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను సేకరించగా, ఏపీలోని కర్నూలును ఆనుకొని ఉన్న గద్వాల జిల్లాలో 60 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. కానీ పక్కనే ఉన్న వనపర్తిలో 16 వేల మెట్రిక్‌ టన్నులు, మహబూబ్‌నగర్‌లో 14 వేలు, నారాయణపేటలో 1,122 మెట్రిక్‌ టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది.  
నిర్మల్‌ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ జిల్లాలోనే అత్యధికంగా 1.71 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలు సేకరించగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ మూడు జిల్లాలలో కలిపి కూడా 40 వేల టన్నులు కూడా కొనుగోలు చేయలేదు.  

దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన మక్కలన్నీ నిజంగా తెలంగాణ రైతుల నుంచే వచ్చాయా, లేక ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు, దళారులు తీసుకొచ్చిన మక్కలు కూడా కొనుగోళ్లలో చేరాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

ఏపీలో మద్దతు లేక తెలంగాణకు మక్కలు 
వ్యవసాయ మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం.. పక్క రాష్ట్రాల్లో మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. కనీస మద్దతు ధర రూ.2,400 ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ మార్కెట్‌లో రైతులు రూ.1,500 నుంచి రూ.1,600కు విక్రయించారు. ఆ రాష్ట్రంలో మార్క్‌ఫెడ్‌ ఎంఎస్‌పీకి కొనుగోలు చేయలేదు. దీంతో రైతుల నుంచి రూ.1,500కి క్వింటాలు చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు, దళారులు అవే మక్కలను అక్రమ మార్గాల ద్వారా తెలంగాణకు తీసుకొచ్చి విక్రయించినట్టు తెలుస్తోంది. ఇందుకు ఆయా జిల్లాల్లోని మార్క్‌ఫెడ్‌ మేనేజర్లు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఖమ్మం, నాగర్‌కర్నూలు జిల్లాలతోపాటు ఏపీ మక్కలు వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మల్‌తోపాటు కామారెడ్డి, నిజామాబాద్‌లకు కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి ఉండొచ్చని మార్క్‌ఫెడ్‌లోనే చర్చ జరుగుతోంది.

మక్కల విక్రయానికి టెండర్లు... 15న మొదటి వేలం
రైతుల నుంచి సేకరించినట్టు చెబుతున్న మక్కల విక్రయానికి తెలంగాణ మార్క్‌ఫెడ్‌ ఈ నెల 7న ఈ–టెండర్లను ఆహా్వనించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిల్వలో ఉన్న మక్కలను మూడు విడతల్లో వేలం వేయనున్నారు. తొలి విడతలో ఈ నెల 15న 16 లాట్‌లను విక్రయించనుండగా, 16, 17 తేదీల్లో మరో రెండు విడతల్లో బిడ్‌లను తెరవనున్నారు. ఒక్కో విడతలో సగటున 4.60 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర మక్కలను వేలం వేయనున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement