సాక్షి, సూర్యాపేట: మరో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(NH-65)పై గత రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తున్న విహారి ట్రావెల్స్ బస్సులో చిట్యాల మండలం పిట్టంపల్లికి చేరుకోగానే పొగలు మొదలయ్యాయి. బస్సు సిబ్బంది అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు వెంటనే బస్సు అద్దాలు, తలుపుల నుంచి బయటకు దూకి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ వెంటనే బస్సు మంటల్లో కాలిపోయింది. ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అదే నిర్లక్ష్యమా?
కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌పై తనిఖీల పేరుతో హడావిడి చేశారు. అయితే అది రెండు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజా ఘటనతో.. నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ లపై చర్యలు తీసుకోవడంలో రవాణాశాఖ అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది.

తాజాగా పిట్టంపల్లి వద్ద ప్రమాదానికి గురైన విహారి ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ లేదని తేలింది. అంతేకాదు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో.. తెలంగాణ కేంద్రంగా ఏపీ, తమిళనాడుకు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు విహారి యాజమాన్యం నడిపిస్తోందని బయటపడింది. సీటింగ్ కోసమని అనుమతులు తీసుకుని స్లీపర్ మార్చేశారని.. బస్సుపై ఐదు చలాన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో.. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగాలు నిద్రమత్తు వీడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది సకాలంలో స్పందించకపోయి ఉన్నా.. ప్రయాణికులు అప్రమత్తం కావడంలో క్షణం ఆలస్యమైనా.. అంతా మృత్యువు ఒడిలోకి చేరుకునేవారేమో!.


