దళితులపై అగ్రవర్ణాల దాడి అమానుషం
మునగాల: ఇటీవల మునగాల మండలం నారాయణగూడెంలో పంచాయతీ ఎన్నికల అనంతరం అగ్రవర్ణాలకు చెందిన కొందరు నాయకులు దళితులపై దాడి చేయడం అమానుషమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గండమళ్ల చెన్నయ్య అన్నారు. గురువారం నారాయణగూడెంలోని మాల కాలనీవాసులను ఆయన పరామర్శించారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో మాల కులస్థులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడి ఘటనపై పోలీసు యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం సబబు కాదన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు బొల్లెద్దు వినయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు మిట్టగణుపుల జగన్నాథం, మిట్టగణుపుల శ్రీను, కన్నెకంటి శైలజ, సుగుణ, కోదాడ నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ యాదవ్, లింగయ్య పాల్గొన్నారు.


