తుదిదశకు కొనుగోళ్లు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ తుదిదశకు చేరుకుంది. ఇప్పటివరకు దాదాపు 3.12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల శాఖ సేకరించింది. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం దొడ్డురకం, సన్నరకం వరిధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వరికోతలు ఆలస్యంగా జరిగిన ఆత్మకూర్ (ఎస్), మోతె, పెన్‌పహాడ్ మండలాల్లో 10వేల మెట్రిక్ టన్నుల నుంచి 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. మిగతా చోట్ల దాదాపు పూర్తయ్యాయి.
348 కొనుగోలు సెంటర్లు
వానాకాలం సీజన్‌లో జిల్లాలో 4.82 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. సుమారు 10.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని, ఇందులో రైతుల అవసరాలు, ప్రైవేట్ అమ్మకాలు పోగా ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు 4,30,880 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా యంత్రాంగం భావించింది. ఇందులో దొడ్డురకం 1,94,591 మెట్రిక్ టన్నులు, సన్నరకం 2,36,289 లక్షల మెట్రిక్ టన్నులు ఉండనుందని అంచనా వేసింది. ఈ మేరకు 121 దొడ్డురకం సెంటర్లు, 227 సన్నరకం వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసింది.
రైతుల ఖాతాల్లో రూ.615 కోట్లు జమ
గత వానాకాలం సీజన్‌లో సన్నరకాలకు తోడుగా దొడ్డురకం వరికి సైతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండేది. ఈసారి దొడ్డురకానికి అంతగా డిమాండ్ లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. గతేడాది కంటే ఈ వానాకాలం కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్మకాలు అధికంగా జరిగాయి. గత వానాకాలం సీజన్‌లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ఈ సారి ఇప్పటికే 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డురకం 17,588 మంది రైతుల నుంచి 99,173 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు సేకరించారు. ఇక 30,537 మంది రైతుల నుంచి 2,13,450 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తంగా రూ.746 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని 48,125 మంది రైతుల నుంచి సేకరించగా.. మరో 10 నుంచి 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో సిద్ధంగా ఉంది. ఇక.. రూ.615 కోట్ల ధాన్యం బిల్లులను రైతుల అకౌంట్లలో జమ చేశారు.
ఫ జిల్లాలో 3.12 లక్షల మెట్రిక్
టన్నుల ధాన్యం సేకరణ
ఫ కోతలు ఆలస్యమైన మండలాల్లో తప్ప మిగతాచోట్ల పూర్తయిన కొనుగోళ్లు
ఫ సేకరించిన ధాన్యం విలువ
రూ.746 కోట్లు


