కేంద్ర ప్రభుత్వ విధానాలపై నేడు నిరసన
సూర్యాపేట అర్బన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై శుక్రవారం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, కందాల శంకర్‌రెడ్డి గురువారం తెలిపారు. సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో కార్మికులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, రైతుల మనుగడకే ప్రమాదం వాటిల్లిందని పేర్కొన్నారు. కార్మిక చట్టాలకు రద్దు చేసి కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. రైతాంగానికి గిట్టుబాటు ధరలు, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతాంగం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మహాసభను
జయప్రదం చేయండి
సూర్యాపేట : సూర్యాపేటలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించే తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మహాసభలో పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వెంకటేశ్వర్లు, బి.సోమయ్య గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ మహాసభకు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు హాజరు కానున్నారని వివరించారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.
వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని గురువారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
హామీ ఇచ్చారు..
అమలు చేశారు
ఫ గోదాం నిర్మాణానికి సొంత స్థలం
విరాళంగా ఇచ్చిన సర్పంచ్
కోదాడరూరల్ : కోదాడ మండలంలోని మంగలితండాలో పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన తొలి హామీని సర్పంచ్ ధారవత్ బాబ్జీ గెలిచిన వెంటనే అమలు చేశారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే రైతుల కోసం ఎరువుల గోదాం, రైతుల సమావేశానికి కావాల్సిన స్థలానికి తన సొంత భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు గురువారం రెండు గుంటల స్థలాన్ని విరాళంగా ఇచ్చి తొలి హామీని నెరవేర్చారు. మిగిలిన హామీలను కూడా త్వరలో అమలు చేస్తానని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నేడు నిరసన


