42 ఏళ్లకు నిర్జీవిగా..
గ్రామంలోనే అంత్యక్రియలు..
వేర్వేరు విద్యార్థి
సంఘాల్లో పనిచేశాం
నల్లగొండ, చండూరు : ఒడిషాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన పాక హనుమంతు 1983లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తరువాత ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదు. ఆయన ఎక్కడ ఉన్నది కూడా కుటుంబ సభ్యులకు తెలియదు. 42 ఏళ్ల తరువాత ఎన్‌కౌంటర్‌లో హనుమంతు మరణించారన్న వార్తతో ఆయన స్వగ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. హనుమంతు మృతదేహాన్ని ఊరికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక చంద్రయ్య, పాపమ్మకు ఆరుగురు సంతానం. వారిలో పెద్ద పాక హనుమంతు. ఆయన తర్వాత పాక అశోక్, యాదమ్మ, లింగమ్మ, సత్తయ్య, పద్మ జన్మించారు. కుటుబంలో పెద్దవాడైన హనుమంతు 1960లో జన్మించారు. ఆయన స్వగ్రామంలో 7వ తరగతి వరకు, చండూరులో పదో తరగతి చదివి తరువాత నల్లగొండ పట్టణానికి చేరుకొని ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తరువాత ఎన్‌జీ కాలేజీలో డిగ్రీ చేస్తుండగానే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులై పార్టీలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇంటికి వచ్చింది కూడా లేదు.
కుటుంబ నేపథ్యం ఇదీ..
మనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లిపోయాక, తండ్రి చంద్రయ్యకు ఉన్న నాలుగెకరాల వ్యవసాయ భూమిలో 2 ఎకరాలు అమ్మేసి ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు. ఆ తరువాత ఇద్దరు కుమారుల వివాహం చేశారు. ఉన్న రెండెకరాల్లో వారికి చెరొక ఎకరం ఇచ్చారు. మొదట్లో కుటుంబం గడవకపోవడంతో అశోక్ ఊరిలోనే కొన్నాళ్లు జీతం ఉన్నాడు. ఆ తరువాత ఆయనతోపాటు కొంతవరకు చదవుకున్న రెండో తమ్ముడు సత్తయ్య నల్లగొండకు వచ్చి స్థిరపడ్డారు. పెద్ద తమ్ముడు పాక అశోక్ బట్టషాపుల్లో పనిచేస్తుండగా, చిన్నతమ్ముడు పాల వ్యాపారం చేస్తున్నారు. 2016లో వారి తండ్రి చంద్రయ్య, 2021లో తల్లి పాపమ్మ మరణించే వరకు పుల్లెంలలోనే నివసించారు.
హనుమంతు తల్లిదండ్రులను
కలిసిన అప్పటి ఎస్పీ దుగ్గల్
పాక హనుమంతు మావోయిస్టు ఉద్యమంలో రాష్ట్ర, కేంద్ర స్థాయి నాయకుడిగా మూడు రాష్ట్రాల ఇంచార్జిగా ఎదిగారు. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 5 సార్లు హనుమంతు ఎన్‌కౌంటర్లలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. తనని లొంగిపోవాలని చెప్పాలని గతంలో నల్లగొండ ఎస్పీగా పనిచేసిన విక్రమ్‌జిత్ దుగ్గల్ పుల్లెంలకు వచ్చి హన్మంతు తల్లితండ్రుల ద్వారా చెప్పించారు. వారికి దుస్తులు, నిత్యావసరాలు ఇచ్చి పరామర్శించారు.
చదువులో, ఆటల్లో మేటి
హనుమంతు చిన్నప్పుడు చదువులో ఆటల్లో మేటిగా ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఎక్కువగా కబడ్డీ ఆడేవాడని, చదువులో కూడా ఫస్ట్ క్లాస్ విద్యార్థిగా ఉండేవాడని, నిత్యం ఆటపాటలతో ఊ రంతా కలియ తిరిగేవారమని చెబుతున్నారు. హనుమంతు 10 తరగతి చదువు కునేంత వరకు విప్లవ భావజాలం అతనిలో కనిపించలేదని, నల్లగొండకు వెళ్లిన తర్వాత ఇక తాము కలవలేదని పలువురు మిత్రులు తెలిపారు.
హనుమంతు అంత్యక్రియలు స్వగ్రా మం పుల్లెంలలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు శుక్రవారం ఉదయం వారు ఒడిషాకు వెళ్తున్నారు. హనుమంతు తోబుట్టువులంతా గ్రామానికి చేరుకోనున్నారు.
చిన్నప్పుడు హనుమంతు గ్రామంలో ఉన్నంత వరకు బాగా ఆడుకునేవాళ్లం. తన చేతిరాత చాలా బాగా ఉండేది. కాలేజీకి నల్లగొండకు వచ్చాక ఆయన నక్సలిజం భావాలకు మళ్లాడు. ఆర్‌ఎస్‌యులో కళాశాల సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేశాడు. అప్పుడు నేను ఏబీవీపీలో ఉన్నాను. ఏచూరి శ్రీను హత్య కేసులో హనుమంతు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడు.
– బొబ్బల మురళిమనోహర్‌రెడ్డి, పుల్లెంల
ఫ విద్యార్థి దశలో ఊరు విడిచి వెళ్లిన హనుమంతు
ఫ మావోయిస్టు ఉద్యమంలో అంచలంచెలుగా ఎదిగిన పుల్లెంల వాసి
ఫ ఎన్‌కౌంటర్‌లో మృతితో గ్రామంలో విషాద ఛాయలు
ఫ కుటుంబ సభ్యుల కడసారి చూపునకు స్వగ్రామానికి చేరుకోనున్న మృతదేహం
42 ఏళ్లకు నిర్జీవిగా..


