మాకా కంప్యూటరే కావాలి! | Priority given to computer courses in engineering | Sakshi
Sakshi News home page

మాకా కంప్యూటరే కావాలి!

Jun 25 2026 2:08 AM | Updated on Jun 25 2026 2:08 AM

Priority given to computer courses in engineering

ఇంజనీరింగ్‌లో మారని ట్రెండ్‌.. కంప్యూటర్‌ కోర్సులకే ప్రాధాన్యం

అన్ని బ్రాంచీల్లో మొత్తం సీట్లు 1,14,007

కంప్యూటర్, ఎమర్జింగ్‌ బ్రాంచీల్లో 81,768 సీట్లు

కౌన్సెలింగ్‌లో టాపర్ల ఆప్షన్‌ అంతంత మాత్రమే

వందలోపు ర్యాంకర్లు ఐదుగురే

5 వేల లోపు ర్యాంకర్లు  2,793 మందే

సాక్షి, హైదరాబాద్‌: ఈసారీ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సీట్లకే అత్యధిక ప్రాధాన్యం కన్పిస్తోంది. సీఎస్‌ఈ, అనుబంధ ఎమర్జింగ్‌ బ్రాంచీల్లోనే 70 శాతం సీట్లున్నాయి. కోర్‌ గ్రూపులపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసినా సీట్లు మాత్రం పెరగలేదు. ఈ ఏడాది ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 19న మొదలుకాగా, ఇప్పటివరకు 84,992 మంది స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. 36,393 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. విద్యార్థులు గురువారం నుంచి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ప్రక్రియ జూలై 1 వరకూ కొనసాగుతుంది. ఏ కాలేజీలో, ఏ బ్రాంచీలో ఎన్ని సీట్లున్నాయనేది సాంకేతిక విద్యా మండలి కౌన్సెలింగ్‌లో పొందుపర్చింది.

కౌన్సెలింగ్‌కు ర్యాంకర్లు అరకొరే..
ఎప్‌సెట్‌లో టాప్‌ ర్యాంకులు వచ్చిన విద్యార్థులు తొలి దశ కౌన్సెలింగ్‌లో ఇప్పటి వరకూ పెద్దగా పాల్గొనలేదు. వాళ్లలో ఎక్కువ మంది జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల వైపు దృష్టి పెట్టారు. కొంతమందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు వచ్చాయి. దీంతో ఐఐటీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. 1–100లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కౌన్సెలింగ్‌కు ఐదుగురు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 1–5000లోపు ర్యాంకు విద్యార్థులు 2,793 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. 80 వేలపైన ర్యాంకున్న వాళ్లు పెద్దఎత్తున ఆప్షన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

మొత్తం సీట్లు 1,14,007
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 యూనివర్సిటీల పరిధిలో 44 (వర్సిటీ క్యాంపస్‌లతో సహా) కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 6,046 సీట్లున్నాయి. వీటిని కన్వీనర్‌ కోటా కిందే భర్తీ చేస్తారు. ఇవికాకుండా రెండు ప్రైవేటు వర్సిటీలున్నాయి. వీటిల్లో 1,800 సీట్లున్నాయి. ఇందులో 1,260 సీట్లను కన్వీనర్‌ కోటా ద్వారా భర్తీ చేస్తారు. ఇక 151 ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. వీటిల్లో 1,06,161 సీట్లున్నాయి.

మొత్తంగా 1,14,007 అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 81,620 సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,14,007 సీట్లు అందుబాటులో ఉంటే... వీటిలో 81,768 సీట్లు సీఎస్‌ఈ, ఇతర ఎమర్జింగ్‌ బ్రాంచీల్లో ఉన్నాయి. వీటిల్లో 58,038 సీట్లు కౌన్సెలింగ్‌ ద్వారా... మిగిలినవి యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. కోర్‌ గ్రూపుల్లో సీట్లు పెరగలేదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ వాటి అనుబంధ బ్రాంచీల్లో 21,896 సీట్లున్నాయి. సివిల్, మెకానికల్‌ వాటి అనుబంధ బ్రాంచీల్లో 9,310 సీట్లు మాత్రమే ఉన్నాయి. కెమికల్, బయోటెక్‌ వంటి ఇతర కోర్సుల్లో 1,033 సీట్లున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement