శిశువునూ కాపాడలేకపోయిన వైద్యులు
మంచిర్యాల జిల్లా: వారిది ఒక అందమైన గిరిజన కుటుం బం. భర్త బీఎస్‌ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తుండగా, భార్య బీఎడ్ పూర్తి చేసి అంగన్‌వాడీ ఆయాగా పని చేస్తోంది. వారికి నాలుగేళ్ల కొడుకు ఉండగా, భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. మరో రెండు నెలలు గడిస్తే వారి కుటుంబంలో మరొకరు చేరుతారనే ఆనందంలో ఉండగా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రసవానికి ఆపరేషన్ చేసే సమయంలో గర్భిణీతో పాటు పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమటిచేను గ్రామపంచాయతీ సాముగూడకు చెందిన అనురాధ(35)కు సోనాపూర్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ కుడిమేత లక్ష్మణ్‌తో వివాహం జరిగింది.
భర్త ఢిల్లీలో విధులు నిర్వహిస్తుండగా, అనురాధ తన తల్లి ఇంటివద్ద ఉంటుంది. ఏడు నెలల గర్భిణి అయిన అనురాధకు బుధవారం ఉదయం కడుపునొప్పి, ఫిట్స్ రావడంతో 108 అంబులెన్స్‌లో మంచిర్యాలలోని మాతాశిశు కేంద్రానికి తరలించారు. అక్కడ మరోసారి ఫిట్స్ రావడంతో వైద్యులు ప్రసవం చేసేందుకు ఆపరేషన్ చేశారు. ఈక్రమంలో అనురాధ మృతిచెందింది. కాగా పుట్టిన మగశిశువును కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో ఫిట్స్ రావడంతో గర్భిణి మృతిచెందిందని, కొద్ది సేపటికి శిశువు సైతం మృతిచెందినట్లు మండల పీహెచ్‌సీ వైద్యురాలు దివ్య తెలిపారు. ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ రాక కోసం మృతదేహానికి ఇంకా అంత్యక్రియలు జరుపలేదు.


